పశువుల పాకనే పాఠశాలగా చేసుకొని.. నేడు జడ్జ్ అయిన పాల వ్యాపారి కూతురు!

Rajasthan Milkman's Daughter Set To Become A Judge. సాధించాలనే పట్టుదల, కృషి ఉంటే ఎలాంటి పేదరికం అడ్డురాదని నిరూపించి జడ్జ్ అయిన రాజస్థాన్ పల వ్యాపారి కూతురు.

By Medi Samrat  Published on  3 Jan 2021 8:47 AM GMT
Sonal Sharma judge

సాధించాలనే పట్టుదల, కృషి ఉంటే ఎలాంటి పేదరికం అడ్డురాదని ఎంతోమంది ఎన్నో సార్లు నిరూపించుకున్నారు. ప్రస్తుతం రాజస్థాన్ కు చెందిన సోనాల్ శర్మ కూడా ఈ కోవకే చెందుతారు. చదువు అంటే ఎంతో ఆసక్తి ఉన్న సోనాల్ కు తన పేదరికం ఏమాత్రం అడ్డు రాలేదు. చదువుపై ఉన్న శ్రద్ధ వల్ల ఎన్నో కుటుంబ సమస్యలను అధిగమించి ప్రస్తుతం న్యాయమూర్తిగా కొలువుదీరనుంది. ప్రస్తుతం సోనాల్ శర్మ విజయం వెనుక ఉన్న కష్టాలను గురించి ఇక్కడ తెలుసుకుందాం...

రాజస్థాన్ ఉదయపూర్ కి చెందిన సోనాల్ శర్మ అతి సాధారణమైన పాల వ్యాపారి కుమార్తె. కొన్ని పశువులను పెట్టుకొని పాల వ్యాపారం ద్వారా వారి కుటుంబాన్ని అయితే సోనాల్ శర్మకు చదువు అంటే ఎంతో ఆసక్తి. ఎలాగైనా కష్టపడి చదివి ఒక న్యాయమూర్తి కావాలన్నదే ఆమె కోరిక. కానీ సోనాల్ తండ్రికి అంత చదువు చదివించే స్తోమత లేదు. సోనాల్ తో పాటు ఇద్దరు పిల్లలు ఉండటం వల్ల కుటుంబ పోషణ భారమైంది.ఇలాంటి సమయంలోనే తన తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ పశువులను చూసుకుంటూ, పాలు పితకడం, కుడితి పెట్టడం వంటి పనులను చేస్తూ ఆ పశువుల పాకనే తన పాఠశాలకు మలుచుకుంది. ఈ విధంగా ఒక వైపు కుటుంబ పనులలో సహాయంగా ఉంటూ, మరొకవైపు చదువుపై దృష్టి సారించింది.

ఆ విధంగా పాలు అమ్మడం ద్వారా వచ్చిన డబ్బుతో కొన్ని పుస్తకాలను కొని ఎంతో కష్టపడి బిఏ, ఎల్ఎల్ బీ, ఎల్ ఎల్ఎం పరీక్షలలో టాప్ ర్యాంకర్ గా నిలబడింది. అంతేకాకుండా మూడు గోల్డ్ మెడల్స్ ను కూడా సంపాదించింది. పశువుల పాక లోనే కూర్చుని పశువుల అవసరాలను తీరుస్తూ రెండేళ్లపాటు ఎల్ ఎల్ఎం కూడా పూర్తి చేసింది. తరువాత రాజస్థాన్ జ్యుడీషియల్ సర్వీస్ (RJS)-2018కు ప్రిపేర్ అవ్వాలని నిర్ణయించుకుంది.ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలంటే ఎంతో కష్టంతో కూడుకున్న పని. అందుకు సంబంధించిన పుస్తకాలు కొనే స్తోమత కూడా వారికి లేదు. అయినా సోనాల్ పట్టు విడవకుండా కాలేజీకి సైకిల్ మీద పెళ్లి లైబ్రరీలో కూర్చొని పుస్తకాలు చదివి వాటిని నోట్సు రాసుకుని ఇంట్లో చదువుకునేది. ఈ విధంగా రాజస్థాన్ జ్యుడీషియల్ సర్వీస్ పరీక్షలను పూర్తి చేసింది. గత సంవత్సరం RJS 2018 పరీక్ష ఫలితాలు వెలువడగా వాటిలో కేవలం ఒక్క మార్కు తేడాతో అర్హత కోల్పోయింది. దీంతో సోనాల్ పేరు వెయిటింగ్ లిస్టులో ఉండిపోయింది.

RJS 2018 ఈ పరీక్షలో అర్హత సాధించిన ఏడుగురు ఈ సర్వీసు లో జాయిన్ కాలేదు. ఈ విషయం తెలిసిన సోలార్ ఎలాగైనా తనకు అవకాశం కల్పించాలని రాజస్థాన్ హైకోర్టులో రిట్ దాఖలు చేసింది. దీనిపై విచారించిన న్యాయస్థానం ఆ ఏడుగురు అభ్యర్థులు స్థానాలలో వెయిటింగ్ లిస్టులో ఉన్న వారికి అవకాశం కల్పించాలని నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ విధంగా సోనాల్ శర్మ మొదటి ప్రయత్నంలోనే న్యాయమూర్తిగా అవకాశాన్ని సంపాదించింది. త్వరలోనే రాజస్థాన్ సెషన్స్ కోర్టులో ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ గా సోనాల్ శర్మ బాధ్యతలు తీసుకోనున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంతో కష్టపడి నా కలను సాకారం చేసుకున్నానని, నా విజయం వెనుక నా కుటుంబ సభ్యులు ఉన్నారని ఆమె ఆనందాన్ని వ్యక్తం చేశారు.


Next Story