తొలి ట్రాన్స్‌జెండర్ న్యాయవాది
Karnataka Transgender Shashi Become Lawyer. తాజాగా కర్ణాటకలో ట్రాన్స్ జెండర్ తొలి న్యాయవాది అయ్యారు.
By Medi Samrat Published on 21 Feb 2021 3:47 AM GMTదేశంలో ట్రాన్స్‌జెండర్స్ అంటే కొందరు చులకన చూస్తుంటారు. అలాంటి వారు సమాజంలో రాణించేందుకు ప్రయత్నాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. దేనిలోనూ తక్కువేం కాదన్నట్లు రాణిస్తున్నారు. తాజాగా కర్ణాటకలో ట్రాన్స్ జెండర్ తొలి న్యాయవాది అయ్యారు. మైసూర్‌లోని జయనగర నివాసి ఆయిన శశికుమార్ అలియాస్ శశి ఒక సీనియర్ న్యాయవాది వద్ద సహాయకురాలిగా పని చేస్తూ ఇప్పుడు న్యాయవాది అయ్యారు.
14 ఏళ్ల పాటు యువకుడిగా ఉన్న ఆయన హార్మోన్స్‌లో వచ్చిన మార్పులతో యువతిగా మారాడు. మైసూర్‌లోని అశోకపురంలో ఉన్న సిద్దార్థ పాఠశాలలో పదో తరగతి వరకు విద్యనభ్యసించిన శశి.. మైసూర్ సైన్స్ (పీసీఎంబీ) చదివారు. ఆ తర్వాత కువెంపు నగరంలో ఉన్న సోమాని కళాశాలలో ఆర్ట్స్ విభాగంలో శిక్షణ పొందారు. కర్ణాటక ఓపెన్ యూనివర్సిటీలో ప్రజా పరిపాలన కోర్సు చదివారు. 2018లో విద్యావర్ధక లా కాలేజీలో చేరి మూడేళ్లలో కోర్సు పూర్తి చేశారు.
ట్రాన్స్‌జెండర్ న్యాయవాది కావడంపై శశి మాట్లాడుతూ.. చిన్ననాటి నుంచి చదువంటే ఎంతో ఇష్టం. ఎంతో మంది నన్ను అవహేళన చేశారు. అయినా అవేమి పట్టించుకోకుండా ఉన్నత విద్యను పూర్తి చేయాలనే ఉద్దేశంతో పట్టుదలతో ముందుకెళ్లాను. అలాగే ఫీజులు చెల్లించేందుకు డబ్బులు లేక ఇళ్లల్లో పని మనిషిగా చేసుకుంటూ ఫీజులు కట్టుకున్నాను. తోలి విద్యార్థుల వద్ద ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. అలాగే ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద యాచించుకోవాలని కొందరు ఒత్తిడి తెచ్చారు. అలాగే వైద్యురాలు జే. రశ్మిరాణి నా ఉన్నత చదువులకు ఫీజులు చెల్లించి ఎంతగానో సహకరించారు అని చెప్పుకొచ్చారు.