అర్ధరాత్రి యువకుడి పరుగు, ఎందుకో తెలుసా..

Inspiring Story - Viral Video. కొన్ని రకాల వీడియోలు మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తే, మరికొన్ని అవాక్కయ్యేలా చేస్తాయి.

By Nellutla Kavitha  Published on  21 March 2022 10:53 AM GMT
అర్ధరాత్రి యువకుడి పరుగు, ఎందుకో తెలుసా..

కొన్ని రకాల వీడియోలు మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తే, మరికొన్ని అవాక్కయ్యేలా చేస్తాయి. కొన్ని వీడియోలు మదిలో నిలిచిపోతే, మరి కొన్ని వీడియోలు స్ఫూర్తిని నింపుతాయి. ప్రతిరోజు సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతున్నా, గత రెండు రోజులుగా ఒక యువకుడి వీడియో మాత్రం సోషల్ మీడియా తో పాటుగా ప్రధాన స్రవంతి లోను ప్రముఖంగా కనిపిస్తోంది. ఇందులో ఒక యువకుడు రాత్రి 12 గంటల సమయంలో రోడ్డుపై పరిగెత్తుతున్న దృశ్యాన్ని చూడవచ్చు. ఢిల్లీ సమీపంలోని నోయిడాలో 19 ఏళ్ల యువకుడు అర్ధరాత్రి, నడిరోడ్డుపై భుజానికి బ్యాగ్ తగిలించుకుని పరిగెత్తుతున్న వీడియోని సీనియర్ జర్నలిస్టు వినేద్ కాప్రి చిత్రీకరించారు. 19 ఏళ్ల ప్రదీప్ మెహ్రా రోడ్డు మీద పరిగెత్తడానికి గల కారణాన్ని వివరిస్తూ ప్యూర్ గోల్డ్ అంటూ జర్నలిస్ట్ వినోద్ కాప్రి పెట్టిన వీడియో ఇప్పుడు ట్విట్టర్ లో సంచలనం గా మారింది.

ఉత్తరాఖండ్కు చెందిన ప్రదీప్ ది నిరుపేద కుటుంబం. నోయిడాలో తన సోదరుడితో కలిసి ఉంటూ స్థానికంగా మెక్డొనాల్డ్స్ లో పని చేస్తున్నాడు. తల్లి ఆసుపత్రిలో ఉంది, తను పని చేసే స్టోర్ నుంచి ఇంటికి దూరం 10 కిలోమీటర్లు. కుటుంబ పోషణ కోసం స్టోర్ లో పనిచేస్తున్న ప్రదీప్ ఆర్మీలో చేరాలని లక్ష్యంతోనే పది కిలోమీటర్ల రన్నింగ్ ప్రాక్టీస్ ఇలాగే చేస్తానని, ప్రతి రోజూ పని తర్వాత ఇంటికి వెళ్ళడానికి అలా పరిగెడుతూ చెప్పడం వీడియో లో కనిపిస్తుంది. వినోద్ కార్ ను స్లో చేసి లిఫ్ట్ ఇస్తానని చెప్పినా ప్రదీప్ నో చెప్పడమే కాదు, ఇంటికి వెళ్లి అన్న కి వంట చేసి కూడా పెడతా అని చెప్పడం అందరిని ఆకర్షించింది. తన వీడియో వైరల్ అయినా తనేమీ తప్పుడు పని చెయ్యట్లేదు అని అంటున్న ప్రదీప్ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఒక్కసారి కార్ ఎక్కితే తన ప్రాక్టీస్ దెబ్బతింటుందని, ఆర్మీలో చేరడమే తన లక్ష్యం అంటూ సున్నితంగా లిఫ్టు ప్రతిపాదనను తిరస్కరించాడు ప్రదీప్. శనివారం రోజు రాత్రి వినోద్ ఈ వీడియోను ట్విట్టర్ లో అప్లోడ్ చేస్తే రెండు లక్షల మందికి పైగా దాన్ని లైక్ చేశారు. ఇక ఆదివారం అర్ధరాత్రి కూడా వినోద్, ప్రదీప్ వీడియోని రికార్డ్ చేసి మళ్ళీ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ప్రదీప్ డెడికేషన్ ని నెటిజన్లు కొనియాడుతూ ఉంటే, మీడియా ఆయన్ని లైవ్ లోకి తీసుకొచ్చింది. వారి మధ్య జరిగిన సంభాషణ వీడియో మీకోసం.
Next Story