కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారా.? ఏం చేయకూడదు.? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.?

Do's and don'ts of Covid vaccine takers. వ్యాక్సిన్ తీసుకోక ముందు, తీసుకున్న తర్వాత కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఎటువంటి సమస్యలు రావని నిపుణులు చెబుతున్నారు.

By Medi Samrat  Published on  28 April 2021 7:39 AM GMT
covid vaccine takers

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంది. మరోవైపు రెండో దశ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కూడా అంతే వేగవంతంగా కొనసాగుతోంది. భారత్ బయోటెక్ రూపొందించిన కోవాక్సిన్, సీరం ఇన్సిస్టిట్యూట్‌ తయారు చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్లు ఇస్తున్నారు. ఇప్పటి వరకు 14కోట్ల మందికిపైగా వ్యాక్సినేషన్ పూర్తయింది. కోట్ల మందికి వ్యాక్సిన్​ఇస్తుండటంతో అక్కడక్కడా కొద్ది మందికి ఇబ్బందులు కలుగుతుండడంతో వ్యాక్సిన్ వేయించుకోవడానికి ప్రజలు కొంత భయపడ్డారు.

అయితే గత 20 రోజులుగా కరోనా కేసులు భారీగా పెరుగుతుండడంతో 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకునేందుకు క్యూ కడుతున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే వ్యాక్సిన్లకు అనుమతినిచ్చామని.. వ్యాక్సిన్​వేసుకోవడం సురక్షితమని కేంద్రం ప్రకటించింది. వ్యాక్సిన్ తీసుకోక ముందు, తీసుకున్న తర్వాత కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఎటువంటి సమస్యలు రావని నిపుణులు చెబుతున్నారు. కొంతమందికి మొదటి, రెండో దశలో టీకా వేసుకున్నపుడు జ్వర్వం, ఒళ్లునొప్పులు లాంటి సాధారణ ఇబ్బందులు ఉంటాయని ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని వైద్య నిపుణులు చెబుతున్నారు.

వ్యాక్సిన్​తీసుకునే ముందు, తర్వాత చేయాల్సినవి:

1. వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందు మీ ఫ్యామిలీ డాక్టర్ లేదా మీకు తెలిసిన వైద్యులను సంప్రదించండి. వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి.

2. ఒకవేళ మీరు మందులు వేసుకుంటే అలెర్జీ వచ్చే ప్రమాదం ఉన్నట్టయితే వైద్యుల సలహాలను పాటించండి.

3. ఇటువంటి సందర్భంలో మీరు కంప్లీట్​బ్లడ్ కౌంట్​(సిబిసి), సి-రియాక్టివ్ ప్రోటీన్ (సిఆర్పి) లేదా ఇమ్యునోగ్లోబులిన్–ఈ (ఐజిఈ) టెస్ట్ చేయించుకొని, ఆ తర్వాత మీ డాక్టర్ల సలహా మేరకు వాక్సిన్​ తీసుకోండి.

4. వ్యాక్సిన్​ వేసుకునే కొద్ది గంటల ముందు తేలికపాటి భోజనం చేయండి. ఎందుకంటే, వ్యాక్సిన్​ వేసుకున్నాక కొద్ది సేపు వరకు మీరు ఏమీ తినకపోవడం మంచిది.

5. వ్యాక్సిన్​కు ముందు కొద్ది సేపు విశ్రాంతి తీసుకోండి. పాజిటివ్​గా ఆలోచించండి. ఒకవేళ, మీరు ఆందోళన చెందుతున్నట్లయితే, అక్కడే ఉండే ఆరోగ్య సలహాదారు సహాయం తీసుకోండి.

6. వ్యాక్సిన్​ తీసుకోవడానికి వెళ్లే సమయంలో తేలికపాటి, సౌకర్యవంతమైన బట్టలనే ధరించండి. తద్వారా, మీ చేతి భుజానికి వ్యాక్సిన్ ఇచ్చేటప్పుడు సక్రమంగా కూర్చోగలరు.

7. మీ నోరు, ముక్కును పూర్తిగా కప్పి ఉంచగలిగే మాస్క్ ధరించి వ్యాక్సిన్​కేంద్రానికి వెళ్లండి.

8. వ్యాక్సిన్​ కేంద్రం దగ్గర ఇతరుల నుంచి కనీసం ఆరు అడుగులు భౌతిక దూరాన్ని పాటించండి.

వ్యాక్సిన్​కు ముందు, తర్వాత చేయకూడనివి:

1. వ్యాక్సిన్​తీసుకున్న తర్వాత మీకు అలర్జీ వచ్చే అవకాశం ఉందని మీ ఫ్యామిలీ డాక్టరు ధృవీకరిస్తే.. ఆ విషయాన్ని వ్యాక్సిన్​ వేసే డాక్టర్ వద్ద అస్సలు దాచకండి.

2. మీకు ఏదైనా జబ్బులు ఉన్నట్లయితే వైద్యుల తప్పకుండా చెప్పాలి.

3. వ్యాక్సిన్​వేసే ముందు లేదా వేసిన తర్వాత ఆల్కహాల్​లేదా ఇతర ఏదైనా మత్తు పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోవద్దు.

4. వ్యాక్సిన్ కేంద్రంలో ఉన్నప్పుడు, మీ చుట్టూ ఉన్న వస్తువులను లేదా ఇతర రోగులను తాకవద్దు. వ్యాక్సిన్​ కేంద్రంలో COVID-19- ప్రోటోకాల్‌ను పాటించండి.

5. వ్యాక్సిన్​ద్వారా దుష్ప్రభావాలు ఉంటాయని ఇతరులు ఇచ్చే ఉచిత సలహాలను పట్టించుకోకండి.

6. వ్యాక్సిన్​కు బదులు ఎసిటమినోఫెన్ లేదా ఇబుప్రోఫెన్ - పెయిన్ కిల్లర్స్ వంటి మెడిసిన్​ తీసుకోవచ్చని ఎవరు చెప్పినా నమ్మకండి. ఎందుకంటే, వీటి వల్ల సైడ్​ఎఫెక్ట్స్​వచ్చే ప్రమాదం ఉంది.

7. ఒకవేళ, వ్యాక్సిన్​పై ఏమైనా సందేహాలుంటే మీ వైద్యుడిని సంప్రదించండి.

వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కలిగే ఇబ్బందులు:

1. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఇంజెక్షన్ ఇచ్చిన భాగంలో నొప్పి, వాపు, జ్వరం, చలి, అలసట, తలనొప్పి వంటివి రావొచ్చు.

2. అంత మాత్రాన ఎటువంటి బయపడాల్సిన అవసరం లేదు. సాధారణంగా, వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత వచ్చే దుష్ప్రభావాలు- ఒకటి లేదా రెండు రోజుల కన్నా ఎక్కువగా ఉండవు.

3. ఒకవేళ మీకు జ్వరం లేదా ఇతర ఇబ్బందులు అలాగే ఉంటే, మీ వైద్యుడితో మాట్లాడండి. మీ వైద్యుడు చెప్పిన జాగ్రత్తలను పాటించండి.


Next Story