త్రివర్ణ పతాకం ఎగరేస్తున్నారా.. ఈ నిబంధనలు పాటించండి
Follow these rules while hoisting the Indian National Flag . దేశానికి స్వతంత్ర వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై
By అంజి Published on 14 Aug 2022 2:08 PM ISTదేశానికి స్వతంత్ర వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చింది. ఈ క్రమంలోనే ప్రజలు తమ ఇళ్లు, షాపుల దగ్గర జాతీయ జెండాలు ఎగరవేస్తున్నారు. అయితే జాతీయ ఎగరవేసే సమయంలో కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం..
2002, జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చిన ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియాలోని పారాగ్రాఫ్ 2.2 ప్రకారం.. ఎవరైనా వ్యక్తి, ప్రైవేటు ప్రభుత్వ సంస్థలు, విద్యా సంస్థలు అన్ని రోజుల్లో జాతీయ జెండా ఎగురవేయొచ్చు. ఇటీవలే పగలు, రాత్రి కూడా జెండా ఎగరవేయొచ్చని ఫ్లాగ్ కోడ్‌లో నిబంధనలు సవరించారు. జాతీయ జెండా చిన్నదైనా, పెద్దదైనా పొడవు, ఎత్తు (వెడల్పు) నిష్పత్తి 3:2 ఉండాలి. జెండా దీర్ఘ చతురస్రంలోనే ఉండాలి. జెండాలో కాషాయం రంగు పైకి ఉండేలా ఎగురవేయాలి.
చేతితో లేదా మిషన్‌పై చేసిన కాటన్, పాలిస్టర్, ఉన్ని, పట్టు, ఖాదీ.. ఇలా వేటితోనైనా జెండాను తయారు చేయవచ్చు. చిరిగిపోయిన, నలిగిపోయిన లేదంటే చిందరవందరగా ఉన్న జాతీయ జెండాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎగురవేయొద్దు. జాతీయ జెండాయే ఎప్పుడూ ఎత్తులో ఉండాలి. మరే ఇతర జెండాలు జాతీయ జెండా కంటే ఎత్తులో ఉండకూడదు. జాతీయ జెండా ఎగురవేసిన స్తంభాలపై ఎలాంటి బిజినెస్ యాడ్స్ ఉండకూడదు. జాతీయ జెండాని ఒక డెకరేటివ్ పీస్‌గా వాడకూడదు.
జాతీయ జెండాని యూనిఫామ్ దుస్తుల్లా వేసుకోకూడదు. ఏ డ్రెస్ మెటీరియల్ మీద కూడా ప్రింట్ చేయకూడదు. నడుముకి కింద భాగంలో ధరించకూడదు. జాతీయ జెండా నేలపైన కానీ, నీళ్లల్లో కానీ పడేయకూడదు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్, ఇతర రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారి వాహనాలపైన మాత్రమే జాతీయ జెండా ఉంటుంది. సొంత వాహనాలపై దానిని వాడకూడదు. జాతీయ జెండాని మాటల ద్వారా లేదంటే చేతల ద్వారా ఎవరైనా అగౌరవపరిస్తే ప్రివెన్షన్ ఆఫ్ ఇన్‌సల్ట్స్ టు నేషనల్ ఆనర్ యాక్ట్, 1971లోని సెక్షన్ 2 కింద మూడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధిస్తారు.