అన్ని సౌకర్యాలతో వీధి కుక్కల కోసం షెల్ట‌ర్‌.. నెట్టింట వైర‌ల్‌..!

A shelter for stray dogs in Hyderabad is going viral on social media. మనిషిని మనిషే పట్టించుకోని ఈ ఆధునిక కాలంలో.. ఆ అపార్ట్‌మెంట్‌ వాసులు మానవత్వం చాటుకున్నారు. వీధి కుక్కలను మనుషులతో

By అంజి  Published on  14 July 2022 12:06 PM GMT
అన్ని సౌకర్యాలతో వీధి కుక్కల కోసం షెల్ట‌ర్‌.. నెట్టింట వైర‌ల్‌..!

మనిషిని మనిషే పట్టించుకోని ఈ ఆధునిక కాలంలో.. ఆ అపార్ట్‌మెంట్‌ వాసులు మానవత్వం చాటుకున్నారు. వీధి కుక్కలను మనుషులతో సమానంగా ప్రేమిస్తున్నారు. వీధి కుక్కల పట్ల మంచి మనసు చాటుకుంటున్నారు. వీధి కుక్కలు నివాసం ఉండేందుకు ప్రత్యేకంగా ఒక షెల్టర్‌ ఏర్పాటు చేశారు. వారు దయా హృదయంతో షెల్టర్‌ లోపల వీధి కుక్కల కోసం బెడ్‌లు కూడా ఏర్పాటు చేశారు. వాటికి ప్రతి రోజూ ఆహారం, తాగడానికి నీరు అందిస్తున్నారు. వీధి కుక్కలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో పాటు, వాటిపై తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.

ఈ డాగ్‌ షెల్టర్‌.. హైదరాబాద్‌ నగరంలోని కొండాపూర్‌లో గల జూబ్లీగార్డెన్స్‌ రోడ్ నెంబర్‌ 8లో కసా రోగ్‌ అపార్ట్‌మెంట్‌ ముందు ఉంది. కాసా రోగ్‌ అపార్ట్‌మెంట్‌ వాసి అంబికా బహ్రీ జంతు ప్రేమికురాలు. ఆమెకు వీధి కుక్కల కోసం ప్రత్యేకంగా ఓ షెల్టర్‌ ఏర్పాటు చేయాలన్న ఆలోచన వచ్చింది. ఆలస్యం చేయ‌కుండా వెంటనే అపార్ట్‌మెంట్‌ ముందు వీధి కుక్కల కోసం చిన్న షెల్టర్‌ ఏర్పాటు చేయించింది. ఈ షెల్టర్‌ ఏర్పాటుకు అపార్ట్‌మెంట్‌ వాసులు కూడా సహకరించారు. ఈ డాగ్‌ షెల్టర్‌ను ఏర్పాటు చేసి రెండేళ్లు దాటింది. రోడ్‌ నెంబర్‌ 8లో ఏర్పాటు చేసి ఉన్న ఈ షెల్టర్‌లో వీధికుక్కలు హాయిగా ఉంటున్నాయి.


అపార్ట్‌మెంట్‌ వాసులు.. రోజు ఉద‌యం, మ‌ధ్యాహ్నం, సాయంత్రం షెల్టర్ వ‌ద్ద‌కు తీసుకొచ్చి ఆహారాన్ని పెడుతున్నార‌ని అక్క‌డి సెక్యూరిటీ సిబ్బంది చెబుతున్నారు. గత ఐదు రోజుల నుంచి వర్షాలు బాగా పడుతున్నాయి. ఇలాంటి సమయాల్లో వీధి కుక్కలకు ఈ షెల్టర్‌ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంద‌ని దారి వెంట వెళ్లేవారు అంటున్నారు. ''మేం కూడా ఆ కుక్క‌ల‌కు తాగడానికి ఏర్పాటు చేసిన నీటి తొట్టిలో మంచినీటిని నింపుతుంటాం.. అవి కూడా మా పట్ల ఎంతో కృతజ్ఞతతో ఉంటాయి'' అని షెల్టర్‌ పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్‌ సెక్యూరిటీ అన్నారు.


నెట్టింట వైరల్‌..

'Youngistaanfdn' వ్యవస్థాపకుడు, పెట్ ల‌వ‌ర్‌ అరుణ్.. ఈ డాగ్‌ షెల్టర్‌ను వీడియో తీసి ట్విటర్‌లో పోస్టు చేశారు. ఎంతో మంది జంతు ప్రేమికులు వీడియో పోస్టును రీ ట్వీట్‌ చేస్తున్నారు. నెట్టింట వైరల్‌గా మారిన ఈ వీడియోకు ఇప్పటికే ట్విటర్‌లో 30k వ్యూస్ వచ్చాయి. ''ఇది అద్భుతమైన విషయం.. దీనిని మరిన్ని ప్రదేశాల్లో, కమ్యూనిటీల్లో ఏర్పాటు చేయాలి'' అని అరుణ్ పేర్కొన్నారు. కసా రోగ్‌ అపార్ట్‌మెంట్ వాసుల‌కు వచ్చిన ఈ ఆలోచన.. చాలా మంచి ఆలోచన, హ్యాట్సాఫ్‌, ఆమెకు అభినందనలు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రభుత్వం కల్పించుకుని వీధి కుక్కల కోసం ఇలాంటి డాగ్‌ షెల్టర్లు ఏర్పాటు చేయాలని.. అందుకు త‌మ‌వంతు సహాయ, స‌హ‌కారాలు అందిస్తామ‌ని అపార్ట్‌మెంట్‌ వాసులు, నెటిజన్లు కోరుకుంటున్నారు.


Next Story