యువకుడిని విచక్షణ రహితంగా నరికి హత్య
By అంజి Published on 5 Feb 2020 9:59 AM IST
ముఖ్యాంశాలు
- నల్గొండ జిల్లా అనుములలో దారుణం
- రేవంత్ అనే యువకుడి దారుణ హత్య
నల్గొండలో దారుణ హత్య ఘటన జరిగింది. రేవంత్ కుమార్ (22) అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి అతి దారుణంగా హతమార్చారు. ఈ ఘటన అనుముల మండలం హాజారీగూడం గ్రామంలో చోటు చేసుకుంది. హాలియ గ్రామానికి చెందిన రేవంత్ కుమార్ కుటుంబం పాల వ్యాపారం చేస్తూ బతుకు జీవనం గడుపుతున్నారు. కాగా ఇవాళ ఉదయం పాలు తీసుకురావాడానికి రేవంత్ ఇంటి నుంచి హాజారిగూడం గ్రామానికి బయల్దేరాడు.
హాలియా శివారులో మార్గం మధ్యలో కాపు కాచి ఉన్న నలుగురు వ్యక్తులు రేవంత్‌పై కత్తులతో దాడి చేసి విచక్షణ రహితంగా నరికి హత్య చేశారు. అప్పుడే అటుగా కొంతమంది స్థానికులు ఈ విషయాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నిందితులను పట్టుకునే పనిలో పోలీసులు ఉన్నారు. రేవంత్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఆస్పత్రికి తరలించారు. రేవంత్ హత్యకు గురయ్యాడన్న వార్త తెలుసుకున్న హాలియా గ్రామ ప్రజలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. రేవంత్ కుమార్ ఇకలేడని తెలిసిన అతని తల్లిదండ్రులు గుండెలవిసెల రోదిస్తున్నారు.