ఆమెకు మొట్టమొదటి సారి చీపురు పట్టుకుని వీధులు ఊడుస్తూంటే చాలా సిగ్గుగా అనిపించింది. భూమిలోకి కూరుకుపోతున్నట్టుగా అనిపించింది. చాలా అవమానంగా అనిపించింది. అందరూ తన వైపే చూస్తున్నట్టు అనిపించింది. మైక్రోబయాలజీలో బిఏ చేసిన కే సంగీత చీపురుపట్టుకుని వీధులు శుభ్రం చేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగం కావాలన్న ఆమె తాపత్రయం ఆమెను వీధులు ఊడ్చేలా చేసింది. కోయంబత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ లో కన్సర్వెన్సీ వర్కర్ గా ఎన్నికయ్యాక ఆమె ప్రభుత్వ ఉద్యోగం వచ్చినందుకు సంతోషపడాలా లేక వీధులు శుభ్రం చేయాల్సి వచ్చినందుకు బాధపడాలా అర్థం కాలేదు. ప్రభుత్వ ఉద్యోగం ఆమెకు చిరకాల స్వప్నం. అది దొరికిన తరువాత కానీ ఆమెకు తన పనేమిటో తెలిసిరాలేదు.

35 ఏళ్ల కే. పద్మావతి కథా దాదాపుగా ఇంతే. వీధులూడ్చే పని ఇష్టం లేదు. కానీ అది ప్రభుత్వోద్యోగం. వచ్చే జీతం రూ. 17500. గతంలో చేసిన ఉద్యోగాల కన్నా ఇది కాస్త మెరుగైనది. ఒక ప్రైవేటు సంస్థలో అకౌంటెంట్ ఉద్యోగాన్ని వదులుకుని మరీ ఆమె ఈ వీధులూడ్చే పనిని ఎంచుకుంది. ఇక్కడ పని గంటలు చాలా తక్కువ. వీధులు ఊడ్చి వీలైనంత త్వరగా ఇంటికి వెళ్లి పిల్లలను చూసుకోవచ్చు.

కోయంబత్తూరులో వీధులు శుభ్రపరిచే స్వీపర్ల ఉద్యోగం కోసం గ్రాడ్యుయేట్లు, పోస్టు గ్రాడ్యుయేట్లు పోటీ పడ్డారు. వారి ఉత్సుకతకి కారణం అవి ప్రభుత్వోద్యోగాలు కావడమే. సివిల్ ఇంజినీరింగ్ లో డిప్లొమా ఉన్న నవీన్ అనే యువకుడు గౌరవం తక్కువైనా జీతం ఎక్కువ అని వాదిస్తున్నాడు. కుటుంబాన్ని పోషించుకునేందుకు ఈ పనిని సిద్ధమయ్యాడు. ఈ ఉద్యోగాలకోసం బ్రాహ్మణాది ఉన్నతవర్గాల వారు సైతం పోటీ పడుతున్నారు. “కనీసం సమానత్వం ఇలాగైనా వస్తోంది” అని కొందరు హర్షం వ్యక్తం చేశారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.