మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పాటు దిశగా బీజేపీ!

By Newsmeter.Network  Published on  10 March 2020 9:24 AM GMT
మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పాటు దిశగా బీజేపీ!

మధ్య ప్రదేశ్‌ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జ్యోతిరావు ఆదిత్య సిందియా కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. సింధియాతో పాటు పలువురు ఎమ్మెల్యేలుసైతం కాంగ్రెస్‌కు రాజీనామా చేయడంతో అక్కడ ప్రభుత్వం సంక్షోభంలో కూరుకుపోయింది. దీంతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు వేగంగా పావులు కదుపుతుంది.

మధ్య ప్రదేశ్‌లో బొటాబొటీ మెజార్టీతో కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ పార్టీ సీఎంగా కమలనాథ్‌ బాధ్యలు చేపట్టారు. కమల్‌నాథ్‌ సర్కార్‌ ఏర్పడిన 15 నెలలకే కుప్పకూలే పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ ఆపరేషన్‌ ఆకర్ష్‌లో భాగంగా సింధియా కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. నాటకీయ పరిణామాల మధ్య సోమవారం పదిహేడు మంది ఎమ్మెల్యేలతో సింధియా బెంగళూర్‌ వెళ్లిపోయారు. ఎమ్మెల్యేలు అందరూ ఫోన్‌ స్విచ్చాఫ్‌లు చేయడంతో కాంగ్రెస్‌లో కలవరం మొదలైంది.

Also read: బీజేపీలోకి సింధియా? కాంగ్రెస్ సర్కార్ కుప్పకూలడం ఖాయమా?

పరిస్థితిని చక్కదిద్దేందుకు కాంగ్రెస్‌ అధిష్టానం 20 మంది మంత్రులను రాజీనామా చేయించినప్పటికీ సంధియా వెనక్కు తగ్గలేదు. దీంతో మంగళవారం ఉదయం అమిత్‌షాతోకలిసి ప్రధాని మోదీతో భేటీ అయిన సింధియా వెంటనే కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కొద్దిసేపటికే సింధియాతో ఉన్న 19మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. వీరంతా బీజేపీజాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరనున్నారు.

ఇదిలా ఉంటే మధ్య ప్రదేశ్‌ శాసన సభలో 230 స్థానాలు ఉన్నాయి. వాటిలో కాంగ్రెస్‌కు 114 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. వీరిలో 19మంది సింధియా వెంట వెళ్తుండగా.. కాంగ్రెస్‌ బలం 95 పడిపోయింది. ఇద్దరు బీఎస్పీ, నలుగురు స్వతంత్ర్య ఎమ్మెల్యేలు, సమాజ్‌ వాదీ పార్టీకి చెందిన ఒకరు కమల్‌నాథ్‌ ప్రభుత్వానికి ప్రస్తుతానికి మద్దతు ఇస్తున్నారు. ఆ ఏడుగురు కలుపుకున్నా కాంగ్రెస్‌ బలం 102 స్థానాలకే పరిమితమవుతుంది. మొత్తం మ్యాజిక్‌ ఫిగర్‌కు కావాల్సింది 116. దీంతో కాంగ్రెస్‌ పార్టీ కుప్పకూలడం ఖాయం కాగా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అనివార్యం కానుంది. ఈ సంక్షోభంలో బీజేపీ వ్యూహానికి కాంగ్రెస్‌ ప్రతివ్యూహం రచిస్తుందా.. పాలన నుంచి తప్పుకుంటుందా వేచి చూడాల్సిందే.

Next Story