'పుర' పోరులో పురుషుల కన్నా మహిళలదే పైచేయి

By Newsmeter.Network  Published on  2 Jan 2020 10:19 AM IST
పుర పోరులో పురుషుల కన్నా మహిళలదే పైచేయి

తెలంగాణలో 120 మునిసిపాలిటీలకు, పది కార్పొరేషన్లకు జనవరి 22 న ఎన్నికలు జరగబోతున్నాయి. అన్ని పార్టీలు తమ తమ అస్త్రాలను బయటకి తీశాయి. వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అయితే అన్ని పార్టీల ముందు ఒక ప్రధాన సమస్య ఉంది. అదేమిటంటే ఈ ఎన్నికల్లో అసలు కింగ్ మేకర్లను తమ వైపు తిప్పుకోవడం.

ఈ సారి పురపాలక ఎన్నికల్లో కింగ్ మేకర్లు క్వీన్ లే.. అవును. మహిళలే ఈ సారి ఎన్నికల్లో కీలకం. డిసెంబర్ 31 న జారీ చేసిన ముసాయిదా వోటర్ల జాబితా ప్రకారం మొత్తం 120 పురపాలక సంస్థల్లో 76 స్థానాల్లో మహిళా వోటర్లదే పై చేయి. వారి సంఖ్యే అధికం. ఇక నిజామాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ లో మహిలా వోటర్లే గెలుపోటములను నిర్ణయిస్తారు. మహిళా వోటర్ల ఆధిక్యం ఉన్న మునిసిపాఇటీల్లో ఆదిలాబాద్, కాగజ్ నగర్, బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూరు, లక్సెట్టిపేట, నిర్మల్, ఖానాపూర్, ఆర్మూర్, బోధన్, భీమ్ గల్, జగిత్యాల, కోరుట్ల, మెట్ పల్లి, రాయికల్, ధర్మపురి, మంథని, సుల్తానాబాద్, కొత్తగూడెం, ఎల్లందు, మహబూబాబాద్, డోర్నకల్, మరిపెడ, తొర్రూరు, నర్సంపేట, పరకాల, వర్ధన్నపేట, హుజూరాబాద్, మెదక్, సమ్మికుంట, చొప్పదండి, కొత్తపల్లి, సిరిసిల్ల, వేములవాడ, కామారెడ్డి,, బాన్స్ వాడ, ఎల్లారెడ్డి, ఆందోల్, జోగిపేట, తూప్రాన్, రామాయంపేట, నర్సాపూర్, గజ్వేల్, హుస్నాబాద్, దుబ్బాక, చేర్యాల్, జనగాం, భవనగిరి, ఆలేర్, యాదగిరిగుట్ట, ఇబ్రాహీంపట్నం, తాండూర్, కొడంగల్, మహబూబ్నగర్, భూత్పూర్, గద్వాల్, ఐజ, వడ్డేపల్లి, ఆలంపూర్, కొత్తకోట, ఆత్మకూర్, అమరచింత, నాగర్ కర్నూల్, దేవరకొండ, మిర్యాలగుడా, నల్గొండ, నందికొండ, హాలియా, హుజూర్ నగర్, కోదాడ, సూర్యాపేట్, నేరేడుచర్ల, సత్తుపల్లి, మధిర, వైరా, మక్తల్, నారాయణపేట్ లు ఉన్నాయి.

వార్డు, డివిజన్ స్థాయి ఎన్నికల్లో మహిళా వోటర్లు అత్యంత కీలకం కానున్నారు. వారి వోట్లు గెలుపోటములను నిర్ధారించబోతున్నాయి. అందుకే పార్టీలన్నీ ఇప్పుడు మహిళా వోటర్లను ఆకర్షించే పనిలో పడ్డాయి. మొత్తం మీద వోటర్లను పరిగణనలోకి తీసుకుంటే మహిళల కన్నా పురుషులు 7136 మంది మాత్రమే ఎక్కువగా ఉన్నారు. కానీ వార్డు స్థాయి లెక్కలను చూస్తే పలు చోట్ల మహిళలదే పైచేయి.

మొత్తం మీద రానున్న పురపాలక ఎన్నికల్లో అన్ని పార్టీలూ దేవుళ్ల కన్నా దేవతలనే ఎక్కువ ప్రసన్నం చేసుకోవాలి. ఎందుకంటే “అమ్మవారు” ఆగ్రహిస్తే అంతే సంగతులు. అందుకే మహిళలను ఆకర్షించే పనిలో అన్ని పార్టీలు ఇప్పటికే తలమునకలవుతున్నాయి.

Next Story