మున్సి'పోల్స్'.. ముగిసిన నామినేషన్ల విత్‌ డ్రా..!

By Newsmeter.Network  Published on  14 Jan 2020 4:55 PM IST
మున్సిపోల్స్.. ముగిసిన నామినేషన్ల విత్‌ డ్రా..!

తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికలకు నామినేషన్లు ఉపసంహరణ గడువు ముగిసింది. ఇప్పటి వరకు 25,768 నామినేషన్లు దాఖలు అయ్యాయి. కాగా రాష్ట్రాంలోని 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో 3,052 వార్డులకు 19,673 సరైన నామినేషన్లు దాఖలు అయ్యాయి. 432 నామినేషన్లు ఎన్నికల అధికారులు తిరస్కరించారు. జనవరి 22న ఎన్నికల జరగనున్నాయి. 25న ఓట్ల లెక్కింపు జరగనుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఏర్పాట్లు చేస్తోంది. మున్సిపాలిటీల్లో రిటర్నింగ్‌ అధికారులు ఎన్నికల ఏర్పాట్లు చేస్తున్నారు.

మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లలోని పోలింగ్‌ కేంద్రాల్లో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేయనున్నారు. అభ్యర్థులకు పార్టీ అధికారికంగా ఇచ్చే బీ-ఫారాల గడువు కూడా ఇవాళ్టి మధ్యాహ్నం 3 గంటలతో ముగిసింది. ఇదిలా ఉంటే కరీనంగర్‌లో పలు కారణాల వల్ల నామినేషన్ల ప్రక్రియ ఆలస్యంగా మొదలైంది. కరీంనగర్‌ కార్పొరేషన్‌లో నామినేషన్ల ఉపసంహరణ గడువు 16న ముగియనుండగా, 25న పోలింగ్‌ జరగనుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే పోలింగ్‌ కేంద్రాలను ప్రకటించింది. 120 మున్సిపాలిటీల్లో 6,325 పోలింగ్‌ కేంద్రాలు, 10 కార్పొరేషన్లలో 1,786 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల కోలాహలం నెలకొంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రచార కార్యక్రమాలతో హోరెత్తిస్తున్నాయి. ప్రధాన పార్టీ అభ్యర్థులకు రెబెల్స్‌ చుక్కలు చూపించారు. పలు ప్రాంతాల్లో పార్టీ నేతల బుజ్జగింపులకు అభ్యర్థులు లొంగలేదు. జనగామ ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీస్‌ ముందు టికెట్‌ దక్కలేదని గంగాభవనీ అనే మహిళ హల్‌చల్‌ చేసింది. పార్టీ కండువాతో ఉరివేసుకునేందుకు ప్రయత్నించింది. కష్టపడ్డవారికి కాకుండా వేరేవాళ్లకు టికెట్లు ఇచ్చారని ఆమె ఆరోపణలు చేసింది. ఆదిలాబాద్‌ జిల్లాలో మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ మనీషా కంటతడి పెట్టుకున్నారు. నామినేషన్లు విత్‌డ్రా చేసుకొని మనీషా తీవ్రంగా విలపించారు. సొంతకుమారుడిని చైర్మన్‌ చేసేందుకు జోగురామన్న కుట్రపన్నారని ఆమె ఆరోపణలు చేశారు.

Next Story