ఆత్మహత్య చేసుకున్న 'జూనియర్ స్టెయిన్'
By తోట వంశీ కుమార్
ఇండియన్ ప్రీమియర్ లీగ్-13వ సీజన్‌కు ఎంపిక అవ్వలేదని ఓ క్రికెటర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముంబైకి చెందిన కరణ్ తివారీ అనే 27ఏళ్ల క్రికెట్ ప్లేయర్ ఉత్తర ముంబైలోని మలాద్ ప్రాంతంలో తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్ అధికారి ఓ ప్రకటనలో తెలిపారు. కాగా.. అతడి బౌలింగ్ శైలి అచ్చం దక్షిణాఫ్రికాకు చెందిన డేల్ స్టెయిన్‌లా ఉంటుంది. దీంతో అందరూ అతన్ని జూనియర్ స్టెయిన్ అని పిలుస్తుంటారు.
కరణ్ ముంబై ప్రొఫెషనల్ జట్టుకు నెట్ ప్రాక్టీస్ బౌలర్. కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వం లాక్‌డౌన్ విధించడంతో.. క్రికెట్‌కు సంబంధించి పలు టోర్నీలు, మ్యాచ్‌లు వాయిదా పడ్డాయి. దీంతో కొంతకాలంగా కరణ్ కుంగుబాటుకు గురయ్యాడు. ఐపీఎల్‌కు ఎంపికవ్వలేదని ఆవేదన చెందాడని పోలీసులు తెలిపారు. సోమవారం రాత్రి తన గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. రాత్రి 10.30 గంటల వరకు అతడు బయటకు రాకపోవడంతో.. కుటుంబ సభ్యులు అతడి పడకగది తలుపులు బద్దలు కొట్టి చూశారు. అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన కరణ్ కెరీర్‌లో సరైన అవకాశాలు రావడంలేదని తన స్నేహితులతో చెప్పేవాడని పోలీసులు పేర్కొన్నారు. ముంబై సీనియర్ జట్టులో చోటు కోసం కరణ్ పలుమార్లు ప్రయత్నించినప్పటికీ విఫలమైనట్లు తెలుస్తోంది. ఆత్మహత్య చేసుకునే ముందు కరణ్.. ఉదయ్‌పూర్‌లోని తన స్నేహితుడికి కాల్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ముంబై సీనియర్ జట్టులో చోటు దక్కట్లేదని, తాను ఇక బ్రతికి ఉండనని అతనికి కాల్ చేసి చెప్పాడట. వెంటనే అతను కరణ్ సోదరికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. కాగా.. కరణ్ మానస్థితి గురించి అతని సోదరి తల్లికి లేటుగా చెప్పడంతో అప్పటికే అతడు చనిపోయాడు.