ముంబై.. పూణేలో కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలు
By మధుసూదనరావు రామదుర్గం Published on 24 July 2020 6:19 PM ISTకరోనా విలయతాండవంతో బిక్కచచ్చిపోతున్న ప్రపంచ దేశాలు ఎప్పుడెప్పుడు నిరోధ మందు.. వ్యాక్సిన్ వస్తుందా అని వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా.. ఇండియా మొదలు చాలా దేశాల్లో వ్యాక్సిన్ కోసం ప్రయోగాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ రేసులో రష్యా ఉరుకులు పరుగులతో ఉంది. ఆగస్టు 3కల్లా వ్యాక్సిన్ వచ్చేస్తోంది అని ఊరిస్తోంది.
ఇదే క్రమంలో లండన్ ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెన్ కా జట్టుకట్టి వ్యాక్సిన్ కోసం శ్రమిస్తున్నాయి. ఈ వ్యాక్సిన్ ప్రయోగానికి మన దేశంలో ముంబై,పూనేలు అనుకూలమని వ్యాక్సిన్ తయారీ భాగస్వామి సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా భావిస్తోంది. ఈ రెండు నగరాల్లో కోవిడ్-19 కేసులు చాలా హెచ్చుగా ఉన్నందున వ్యాక్సిన్ నిరోధకశక్తిని పరీక్షించేందుకు అవకాశాలు ఎక్కువగా అని అంటోంది.
రెండు నెలల కిందట అనుకున్న షెడ్యూల్ ప్రకారం వచ్చే ఆగస్టు నెలాఖరుకల్లా పూనేజిల్లా ,ముంబైలలో క్లినికల్ ప్రయోగాల్లో భాగంగా 4వేల నుంచి 5వేల మంది కరోనా బాధితులకు వ్యాక్సిన్ ఇంజెక్ట్ చేయనున్నట్టు సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐఐ) తెలిపింది. ఇప్పటికే నిర్వహించిన వాక్సిన్ పరీక్షలు సంతృప్తికరంగా ఉన్నట్టు ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ తెలిపింది. వాక్సిన్ సామర్థ్యం, కచ్చితత్వం తెలుసుకోడానికి యూకే, ఇండియాల్లోఇంకా పెద్దయెత్తున పరీక్షలు నిర్వహిస్తున్నట్టు వివరించింది. మనవాళ్లకు వాక్సిన్ సురక్షితమని, ప్రభావాత్మకంగా పనిచేస్తుందని ప్రకటించే ముందుగా, నిర్మాణ భాగస్వామి సీఐఐ మన దేశంలో పరీక్షలు చేపట్టాల్సి ఉంది.
ఇప్పటి దాకా పూణే జిల్లాలో 59వేలు, ముంబైలో లక్షా మూడువేల దాకా కరోనా పాజిటివ్ కేసులు నమోద య్యాయి. మహారాష్ట్ర మొత్తం కేసుల్లో సగం ఈ రెండు నగరాల నుంచే ఉన్నాయి. ముంబై పూనేలు కరోనా హాట్ స్పాట్ కేంద్రాలుగా మారడంతో ఈ రెండు నగరాల్లో ఎక్కడెక్కడ ఎన్ని పరీక్షలు చేపట్టాలన్న జాబితా ఇప్పటికే సిద్ధం చేసుకున్నట్లు ఎస్‌ఈఈ చీఫ్ ఎగ్జిక్యుటివ్ ఆదార్ పూనావాలా పీటీఐకి ఇచ్చిన ఈ మెయిల్ ఇంటర్వ్యూలో తెలిపారు.
డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి రాగానే భారత్ లో కోవిషీల్డ్ వాక్సిన్ ప్రయోగంలో కీలకమైన మూడో దశ పరీక్షలు ఆగస్టులో చేపట్టనున్నట్టు ఆయన తెలిపారు. సురక్ష, కచితత్వం, నియమ నిబంధనలు దృష్టిలో పెట్టుకుని భారత ఔషధ నియంత్రణ విభాగ అధికారులు ఫాస్ట్ ట్రాకింగ్ అప్రూవల్ లో ఎంతో సానుకూలంగా స్పందిస్తున్నారని పూనావాలా వివరించారు. వాక్సిన్ తయారీలో ఏమాత్రం తొందరపడటం లేదని, ప్రజలకు మంచి వాక్సిన్ అందివ్వాలన్నదే తమ లక్ష్యమని ఆయన అన్నారు.
పూనావాలా తండ్రి కంపెనీ చైర్మన్ సైరస్ పూనావాలా ఎస్ ఈఈ కంపెనీ ఇండియాలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసు రూ.1000 ప్రకారం విక్రయించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అన్ని పరీక్షలు విజయవంతంగా ముగిసి సంబంధిత అధికారుల నుంచి ఆమోదం పొందాక కంపెనీ ఏటా 300 నుంచి 400 మిలియన్ డోసుల వ్యాక్సిన్ ఉత్పత్తి లక్ష్యంగా చేసుకున్నట్టు పూనావాలా చెప్పారు.
ఒప్పందం ప్రకారం అస్ట్రాజెనెకా, ఎస్ ఈఈ లు ఇండియా, మరో 70 దిగువ మధ్య ఆదాయ దేశాల కోసం ఒక బిలియన్ డోసులు తయారు చేస్తాయని అన్నారు. ఒక్కసారి అన్ని అనుమతులు వచ్చాక వాక్సిన్ తయారీ తమకు పెద్ద కష్టం కాదని, రోజుకు రమారమి 60 నుంచి 70 మిలియన్ల డోసులు ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉందని స్పష్టం చేశారు. కోవిడ్-19 వ్యాక్సిన్ ప్రాజెక్ట్ అంచనా వ్యయం 200 మిలియన్ల యూఎస్‌డీ అని వివరించారు.
కరోనా వీర విజృంభణ చూశాక.. వ్యాక్సిన్ వీలైనంత త్వరగా వచ్చి ప్రజలు తేరుకుంటే అదే పదివేలు అనిపిస్తుంది.