ముంబై మెరుపులు.. పంజాబ్‌కు మరో ఓటమి
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 2 Oct 2020 8:09 AM ISTఐపీఎల్ టీ20లో భాగంగా కింగ్స్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 48 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసి పంజాబ్‌కు 192 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించిన ముంబై.. ఆపై పంజాబ్‌ను కట్టడి చేసి విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
ముందు ముంబై ఇన్నింగ్స్ నత్తనడకనే ఆరంభించినా చివర్లో చెలరేగిపోయింది. దాంతో భారీ స్కోరును సాధించింది. టాస్ గెలిచి కింగ్స్ పంజాబ్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోవడంతో ముంబై బ్యాటింగ్‌కు దిగింది. ముంబై ఇన్నింగ్స్‌ను రోహిత్-డీకాక్‌లు ఆరంభించారు. ముంబై జట్టులో రోహిత్(70; 45 బంతుల్లో 8 ఫోర్లు, 3సిక్స్‌లు), పొలార్డ్(47 నాటౌట్; 20 బంతుల్లో 3 ఫోర్లు, 4సిక్స్‌లు), హార్దిక్ పాండ్యా( 30 నాటౌట్; 11 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు)లు బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించారు. కింగ్స్ బౌలర్లలో కాట్రెల్, షమీ, గౌతమ్‌లు తలో వికెట్ తీశారు.
అనంతరం ఛేదనకు దిగిన కింగ్స్ పంజాబ్‌ను ముంబై బౌలర్లు ఆదిలోనే దెబ్బకొట్టారు. ఫామ్‌లో ఉన్న మాయంక్ అగర్వాల్(25), కేఎల్ రాహుల్(17)లను తక్కువ స్కోరుకే పెవిలియన్ చేర్చారు. ఒక్క నికోలస్ పూరన్(44; 27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మాత్రమే రాణించాడు. చివర్లో గౌతమ్(22 నాటౌట్; 13 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) చివర్లో బ్యాట్ ఝుళిపించాడు. మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ రాణించకపోవడంతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 143 పరుగులే మాత్రమే చేసి మరో ఓటమిని ఖాతాలో వేసుకుంది.
ముంబై బౌలర్లలో బుమ్రా, పాటిన్‌సన్, రాహుల్ చాహర్‌లు తలో రెండు వికెట్లు సాధించగా, బౌల్ట్, కృనాల్ పాండ్యా తలో వికెట్ తీశారు. ఇదిలావుంటే శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైద్రాబాద్ జట్లు దుబాయి ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా తలపడనున్నాయి.