ప్లే ఆఫ్ బెర్తును కన్ఫర్మ్ చేసుకున్న ముంబై
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 29 Oct 2020 12:04 PM IST
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్‌లో ప్లే ఆఫ్స్ బెర్తును ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. బుధవారం రాత్రి బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌ను ఓడించి.. ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు చేరిన తొలి జట్టుగా ముంబై నిలిచింది. అబుదాబి వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ ప్రదర్శనలో బెంగళూరును అయిదు వికెట్ల తేడాతో చిత్తుచేసింది.
టాస్ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. దేవదత్ పడిక్కల్(45 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్‌తో 74), జోష్ ఫిలిప్(24 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 33) రాణించారు. ముంబై బౌలర్లలో బుమ్రా(3/14) మూడు వికెట్లతో రాణించగా.. ట్రెంట్ బౌల్ట్, రాహుల్ చాహర్, కీరన్ పొలార్డ్ తలో వికెట్ తీశారు. అనంతరం ముంబై 19.1 ఓవర్‌లో 5 వికెట్లకు 166 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. సూర్యకుమార్ యాదవ్ (43 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 79 నాటౌట్) విజృంభించాడు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరుకు ఆ జట్టు ఓపెనర్లు శుభారంభం అందించారు. పడిక్కల్, ఫిలిఫ్(33 24 బంతుల్లో 4పోర్లు, 1 సిక్సర్) తొలి వికెట్‌కు 71 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఆ తరువాత వచ్చిన కెప్టెన్ కోహ్లీ(9), డివిలియర్స్(15) నిరాశపరిచారు. ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో.. పరుగులు రావడం కష్టమైంది. చివర్లో సుందర్(10*), గుర్‌కీత్(14*) బ్యాట్ ఝుళిపించడంతో బెంగళూరుకు ఆ మాత్రం స్కోరైనా వచ్చింది.
165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌కు మంచి ఆరంభం దక్కలేదు. మహ్మద్ సిరాజ్ వేసిన 6వ ఓవర్‌లో క్వింటన్ డికాక్ (18) క్యాచ్ ఔట్‌గా వెనుదిరగ్గా.. చాహల్ వేసిన 8వ ఓవర్‌లో ఇషాన్ కిషన్(25) ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సౌరభ్ తివారీ(5)ని సిరాజ్ ఔట్ చేయగా.. కృనాల్ పాండ్యా(10)ను చహల్ పెవిలియన్ చేర్చాడు. అయితే మరోవైపు సూర్యకుమార్ యాదవ్ మాత్రం ధాటిగా ఆడాడు. అతని తోడుగా హార్దిక్ పాండ్యా(17) కూడా దూకుడు కనబర్చాడు. సూర్య కుమార్ యాదవ్ 29 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సీజన్‌లో అతనికిది మూడో హాఫ్ సెంచరీ. అనంతరం ఓవర్‌కో బౌండరీ రాబట్టిన ఈ జోడీ జట్టును విజయం దిశగా తీసుకెళ్లింది. దాంతో ముంబై విజయానికి చివరి 12 బంతుల్లో 16 పరుగులు అవసరమయ్యాయి. పాండ్యా వికెట్ కోల్పోయినా.. సూర్యకుమార్ యాదవ్, పొలార్డ్ మిగతా పనిని పూర్తి చేశారు.