మోడీకి మల్టీఫ్లెక్సుల యజమానులు ఇచ్చిన హామీలేమంటే?
By సుభాష్ Published on 24 July 2020 11:50 AM ISTరోటీన్ గా చూసే అంశాల లోతుల్లోకి చాలామంది వెళ్లరు. అలా వెళ్లినంతనే ఉలిక్కిపడటమే కాదు.. ఏంటి? ఇంత సీన్ ఉందా? అన్న మాట నోటి నుంచి అదాటున వచ్చేస్తుంది. దేశ వ్యాప్తంగా ఉన్న సినిమా థియేటర్లను పక్కన పెట్టేసి.. కేవలం మల్టీఫ్లెక్సుల్ని మాత్రమే పరిగణలోకి తీసుకొని.. అవి చేసే వార్షిక వ్యాపారం ఎంత? అన్న ప్రశ్న వేస్తే.. వచ్చే సమాధానం కనీసం ఊహకు అందని రీతిలో ఉంటుంది. మల్టీఫ్లెక్సుల వ్యాపార వర్గాల లెక్కల ప్రకారం చూస్తే.. ఏడాదికి దేశ వ్యాప్తంగా ఉన్న మల్టీఫ్లెక్సులు చేసే వ్యాపారం అక్షరాల రూ.12వేల కోట్లు. అంటే.. ప్రతి నెలా మల్టీఫ్లెక్సులు చేసే వ్యాపారం వెయ్యి కోట్లు కావటం గమనార్హం.
వీటికి సింగిల్ థియేటర్లను లెక్కలోకి తీసుకుంటే.. అంకెలు మరింతఘనంగా ఉండటం ఖాయం. మరింత.. వ్యాపారం కరోనా కారణంగా పోగొట్టుకోవటం ఇబ్బంది. ఏదో ఒకట్రెండు నెలలు అయితే ఓకే కానీ.. మరీ ఆరేడు నెలలు అంటే కష్టమే. ఈ కారణంతోనే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో మూసేసిన మల్టీఫ్లెక్సుల్ని త్వరగా తెరవాలన్న డిమాండ్ ను తెర మీదకు తీసుకొచ్చారు. దీనికి కేంద్రం అనుమతి కావాల్సి ఉన్నందున ప్రముఖ మల్టీఫ్లెక్స్ చైన్ల సీఈవోలు తాజాగా పీఎంవోకు ఒక లేఖ రాశారు.
ఆగస్టు చివరి నుంచి థియేటర్లను తెరిచేందుకు వీలుగా అనుమతి ఇవ్వాలని కోరుతున్న వారు.. ప్రభుత్వం ఓకే అంటే.. మరిన్ని జాగ్రత్తలు చేపడతామని పేర్కొన్నారు. మల్టీఫ్లెక్సుల్లో తీసుకునే జాగ్రత్తల కారణంగా వైరస్ వ్యాప్తి చెందే వీల్లేదన్న వాదనను వినిపించారు. మల్టీఫ్లెక్స్ లోకి వచ్చే వారు మాస్కు తప్పనిసరి చేస్తామని.. లోపలకువచ్చే ముందు తప్పనిసిరగా టెంపరేచర్ చెక్ చేస్తామంటున్నారు. థియేటర్లో మొత్తం ప్రక్రియ పేపర్ ను పక్కన పెట్టేసి.. డిజిటల్ రూపంలోకి తీసుకెళతామన్న హామీని ఇస్తున్నారు. అంతేకాదు.. టికెట్ మొత్తాన్ని ఎస్ఎంఎస్.. బార్ కోడింగ్ లో స్కానింగ్ పద్దతిని తెస్తామంటున్నారు. థియేటర్ లోపల ఒక సీటుకు ఒక సీటుకు మధ్య గ్యాప్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇస్తున్నారు.
ఏ మల్టీఫ్లెక్సులోనే ఒక సమయంలో రెండు షోలు ప్రారంభం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని.. దీంతో రద్దీ ఉండదని చెబుతున్నారు. అంతేకాదు మధ్యలో వచ్చే ఇంటర్వెల్ కు ఒక స్క్రీన్ కు మరో స్క్రీన్ కు మధ్య కనీసం పదిహేను నిమిషాల వ్యత్యాసం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటామంటున్నారు. అంతే కాదు షోకు షోకు మధ్య పదిహేను నిమిషాల గ్యాప్ లో ప్రతి సీటును శానిటైజ్ చేస్తామని.. మల్టీఫ్లెక్సుల్లో శానిటైజ్ ఎక్కువగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోనున్నట్లు చెప్పారు. మరి.. వీరి విషయంలో ప్రధాని ఏ రీతిలో రియాక్ట్ అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.