ఆసియా సంపన్నుడి హోదా కోల్పోయిన ముఖేష్ అంబానీ
By సుభాష్ Published on 11 March 2020 2:20 PM GMTప్రపంచవ్యాప్త చమురు సంక్షోభం కారణంగా ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా తనకున్న హోదాను రిలయెన్స్ దిగ్గజం ముఖేష్ అంబానీ కోల్పోయాడు. దాదాపు 5.8 బిలియన్ల డాలర్లు నష్టపోవడంతో ఆయన తన స్థానాన్ని వదులుకోవలసి వచ్చింది. ఇప్పుడు అలీబాబా సంస్థ యజమాని జాక్ మా తొలి స్థానంలోకి వచ్చారు. గత 2018 మధ్యభాగంలో రిలయెన్స్ తో పోటీలో వెనుకబడ్డ జాక్ మా మళ్లీ రెండేళ్ల తరువాత తిరిగి ప్రథమస్థానాన్ని ఆక్రమించారు. జాక్ మా ప్రస్తుత ఆస్తులు 44.5 బిలియన్ల డాలర్లుగా నమోదైంది. ముఖేష్ ఆస్తుల విలువ కన్నా ఇది 2.6 బిలియన్ల డాలర్లు ఎక్కువ.
ఒక వైపు కరోనా కుదుపు తో స్టాక్ మార్కెట్ పతనం, మరో వైపు సౌదీ అరేబియా రష్యా ట్రేడ్ వార్ షాక్ తోడూ రిలయన్స్ ను పూర్తిగా అతలాకుతలం చేసేసింది. ఇన్వెస్టర్ల హడావిడి అమ్మకాలతో ఆర్‌ఐఎల్ షేర్ల విలువ గత పుష్కర కాలంలో కనీవినీ ఎరుగని రీతిలో సోమవారం అత్యంత ఘోరంగా పడిపోయింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర బీఎస్‌ఈలో 13.65 శాతం పతనమై రూ.1,094.95 కు చేరుకుంది. మొత్తం మీద గత నాలుగు రోజుల్లో రిలయెన్స్ 18శాతం కోల్పోయింది. దీనితో రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా కూడా భారీగా నష్టపోయింది.
దేశీయ స్టాక్‌మార్కెట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సోమవారం నష్టాన్ని నమోదు చేసింది. కీలక సెన్సెక్స్ 2,450 పాయింట్లు, నిఫ్టీ 6.15శాతం కుప్పకూలింది. ఇప్పుడు 2021 నాటికి నికర ఋణాలను శూన్య స్థాయికి తీసుకువస్తానన్న ముఖేష్ అంబానీ వాగ్దానం అమలవుతాయా అన్న అంశంపై సందేహాలు వ్యక్తమౌతున్నాయి. కరోనా వైరస్ పుణ్యమా అని అలీబాబాకు కూడా కొంత దెబ్బ తగిలినా క్లౌడ్ కంప్యూటింగ్ వంటి రంగాల్లో జాక్ మా పుంజుకోగలిగారు.