ధోనీ మాట వినని సామ్.. వీడియో వైరల్
By తోట వంశీ కుమార్ Published on 13 May 2020 11:47 AM ISTకరోనా ముప్పుతో క్రీడా టోర్నీలు వాయిదా పడ్డాయి. దీంతో ఆటగాళ్లంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. కరోనా సెలవుల్ని తమ కుటుంబ సభ్యులతో కలిసి హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు. లాక్‌డౌన్ కాలంలో తాము చేసే పనులను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిరవధికంగా వాయిదా పడడంతో టీమ్ఇండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రాంచీలోని తన ఫాంహౌజ్‌లో తన కుటుంబ సభ్యులతో కలిసి హాయిగా లాక్‌డౌన్ కాలాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. తన కూతురు జీవాతో కలిసి ఆడుకుంటున్నాడు. ఇక వీరిద్దరు చేసే అల్లరిని ధోని భార్య సాక్షి సింగ్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తోంది.
తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ ధోనికి సంబంధించిన ఓ వీడియోను పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఫామ్‌హౌజ్‌లోని గార్డెన్‌లో ధోని, సాక్షి, జీవాలు సరదాగా ఆడుకుంటున్నారు. అక్కడ వారి పెంపుడు కుక్క సామ్ కూడా ఉంది. సామ్‌ను క్యాచ్ పట్టమంటూ ధోని ఓ బాల్‌ను విసిరాడు. అయితే.. సామ్ ధోని మాటను వినలేదు సరికదా.. అక్కడి నుంచి కనీసం కదలను కూడా కదలలేదు. ఇదే సమయంలో సాక్షి మాట్లాడుతూ.. నేను ఇక్కడ ఉన్నంత వరకే సామ్ నీ మాట వినదు అంటూ ధోనిని ఆటపట్టించింది. అనంతరం సామ్.. సాక్షి ఆజ్ఞను తూచా తప్పకుండా పాటించింది. కూర్చోమన్నప్పుడు కూర్చోవడమే కాకుండా.. ఆమె విసిరిన బంతిని సైతం అద్భుతంగా క్యాచ్ పట్టింది. ఇదంతా ధోని చూస్తూ ఉండిపోయాడు. ఈ వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ ట్విట్టర్‌లో పోస్టు చేయగా.. క్షణాల్లో వైరల్ గా మారింది.
2019 ప్రపంచకప్ తరువాత క్రికెట్‌కు ధోని దూరంగా ఉన్నాడు. కొంతకాలం ఆర్మీలో సేవలు అందించిన ధోని తరువాత కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్లాడు. ప్రస్తుతం ధోని రీఎంట్రీ ఇచ్చే ఆలోచనలో ఉన్నాడు. ఐపీఎల్ లో సత్తా చాటి టీమ్ఇండియాలోకి ఘనంగా రీ ఎంట్రీ ఇవ్వాలని అనుకోగా.. ఐపీఎల్ వాయిదాతో ధోని భవిషత్తు ప్రశ్నార్థకరంగా మారింది. అక్టోబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్ లో ధోని చోటు దక్కించుకోవాలని అతడి అభిమానులు కోరుకుంటున్నారు. మరీ బీసీసీఐ ధోని విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడక తప్పదు.