ధోని 1800 రూపాయలు బాకీ ఉన్నాడట.. కట్టాల్సిందే..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  8 Sep 2020 11:52 AM GMT
ధోని 1800 రూపాయలు బాకీ ఉన్నాడట.. కట్టాల్సిందే..!

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇటీవలే తన అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికారు. ప్రస్తుతం ఐపీఎల్ లో భాగంగా యుఏఈలో ఉన్నాడు ధోని. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టుతో సెప్టెంబర్ 19న మొదటి మ్యాచ్ లో ధోని సారథ్యం వహిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది.

తాజాగా ధోని ఝార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ (జె.ఎస్.సి.ఏ.) కు 1800 రూపాయలు బాకీ పడ్డాడన్న విషయం బయటకు వచ్చింది. ఝార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ కు లైఫ్ టైమ్ మెంబర్ షిప్ ను ధోని కట్టాల్సి ఉండగా.. కొన్ని కారణాల వలన బకాయి పడ్డాడట..! ఈ విషయం తెలిసి ధోని అభిమానులు డబ్బులు ఇవ్వాలని భావిస్తూ ఉంటే అందుకు ఝార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ అధికారులు ఒప్పుకోవడం లేదు.

మహేంద్ర సింగ్ ధోనికి ఝార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ లైఫ్ టైమ్ మెంబర్ షిప్ ను ఇచ్చారు. 10000 రూపాయలు నెట్ అమౌంట్ కాగా.. జీఎస్టీ కలిపితే 11800 రూపాయలు అవుతుంది. ఝార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ కు చెందిన అధికారులు ఇటీవల రాంచీలోని ధోని ఇంటికి వెళ్లగా అక్కడ ఉన్న వాళ్లకు లైఫ్ టైమ్ మెంబర్ షిప్ ఎంతో తెలీదు.. దీంతో 10000 చెక్ మాత్రమే ఇచ్చారు. దీంతో ధోని ఝార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ కు 1800 రూపాయలు బాకీ పడ్డాడని ఇటీవలే విషయం బయటకు పొక్కింది.

క్రికెటర్ అలాగే యాక్టివిస్ట్ అయిన శేష్ నాథ్ పాథక్, మరికొందరు ధోని అభిమానులు కలిసి ధోని బకాయి ఉన్న 1800 రూపాయలను కలెక్ట్ చేసి డ్రాఫ్ట్ రూపంలో ఇవ్వాలని అనుకున్నారు. దాన్ని తీసుకోడానికి ఝార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ సముఖంగా లేనట్లు తెలుస్తోంది. ఝార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ అధికారులు తాము ఇచ్చిన డ్రాఫ్ట్ ను తీసుకోవాలని అనుకోవడం లేదు. డబ్బులను తీసుకుని రిసిప్ట్ ఇవ్వడానికి కూడా ఎవరూ ముందుకు రావడం లేదని పాథక్ మీడియాకు తెలిపాడు. ఝార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ లో చాలా అవకతవకలు జరుగుతున్నాయని పాథక్ వెల్లడించాడు.

మహేంద్ర సింగ్ ధోని వారిని ఈ బకాయి చెల్లించమని అడగలేదని.. సదరు వ్యక్తి చెప్పకుండా ఎవరు పడితే వారి నుండి డబ్బులు తీసుకోవడం సరికాదని ఝార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ అధికారులు చెబుతున్నారు. 'ఎవరైనా వ్యక్తి ఏదైనా చేయాలని అనుకుంటే చేయాలి.. ఎవరైనా వ్యక్తిని ధోని డబ్బు కట్టమని పంపితే ఆ వ్యక్తి మాత్రమే కట్టాలి..? ఈ వ్యక్తులను ధోని డబ్బు కట్టమని అడిగారా..? లేదు కదా.. ఈ విషయంలో నా పర్మిషన్ అవసరం లేదు.. ఏ వ్యక్తి అయితే డబ్బులు కట్టాలి అని అనుకుంటున్నాడో ఆ వ్యక్తి అనుమతి కావాలి' అని ఝార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరి సంజయ్ సహాయ్ తెలిపారు.

ఝార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ ఇటీవల వార్షిక రిపోర్టును బయట పెట్టినప్పుడు ధోని బకాయి పడ్డ విషయం మీడియాకు తెలిసింది.

Next Story