ప్రాక్టీస్‌ లేకనే.. లోయర్‌ ఆర్డర్‌లో ధోని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 Sep 2020 6:44 AM GMT
ప్రాక్టీస్‌ లేకనే.. లోయర్‌ ఆర్డర్‌లో ధోని

కరోనా కారణంగా ఐపీఎల్‌ ఈ సారి ఆలస్యంగా ప్రారంభమైనప్పటికి క్రికెట్‌ అభిమానులకు కావాల్సిన వినోదాన్ని పంచుతోంది. చెన్నై జట్టు మాత్రమే ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లు ఆడింది. ముంబైతో మ్యాచ్‌లో గెలవగా.. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో ఓడిపోయింది. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ ధోని లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు. తన కంటే ముందుగా ఆల్‌రౌండర్లు సామ్‌కరణ్‌, రవీంద్ర జడేజాలను ముందుగా పంపించాడు. తొలి మ్యాచ్‌లో ఈ వ్యూహం ఫలించినా.. రెండో మ్యాచ్‌లో మాత్రం బెడిసి కొట్టింది. ధోని కూడా అనుకున్న స్థాయిలో బ్యాట్‌ ఝళిపించలేకపోయాడు. చివరి ఓవర్‌లో మూడు సిక్సర్లు బాదినా అప్పటికే మ్యాచ్‌ చేజారిపోయింది.

సామ్‌ కరణ్‌ను పంపించినా స్థానంలో ధోని వస్తే.. మ్యాచ్‌ మరోలా ఉండేదని పలువురు మాజీలు విశ్లేషిస్తున్నారు. అయితే.. మ్యాచ్‌ల అనంతరం ధోని తాను ఎందుకు లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు వస్తున్నాను అనే దానిపై క్లారిటీ ఇచ్చాడు. 14 రోజుల క్వారంటైన్‌లో ఉండడం తన ప్రాక్టీస్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపిందని తెలిపాడు. ఎక్కువ సేపు సాధన చేసే అవకాశం దొరకలేదని చెప్పాడు. అందులోనూ ఏడాది కాలం బ్యాటు పట్టుకోకపోవడంతో లోయర్‌ ఆర్డర్‌లో వస్తున్నానని నిజం చెప్పేశాడు. చెన్నై శిబిరంలో ఇద్దరు ఆటగాళ్లు సహా 13 మందికి కరోనా సోకడంతో ఎక్కువ రోజులు క్వారంటైన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌లో తొలి మ్యాచ్‌ కాకుండా మరికొన్ని రోజుల తరువాత ఆడేందుకు సీఎస్‌కేకు బీసీసీఐ అవకాశం ఇచ్చిందని.. కానీ.. ధోనినే ఆ ప్రతిపాదనను తిరస్కరించాడని అప్పట్లో వార్తలు వినిపించాయి.

మొదట బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ సంజూ శాంసన్ (74; 32 బంతుల్లో 1x4, 9x6), స్టీవ్ స్మిత్ (69; 47 బంతుల్లో 4x4, 4x6), జోఫ్రా ఆర్చర్‌ (27; 8 బంతుల్లో 4x6)లు రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 216 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. లక్ష్య ఛేదనలో చెన్నై 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ఫాఫ్ డూప్లెసిన్ (72; 36 బంతుల్లో 1x4, 7x6) ఒంటరి పోరాటం చేసినా.. ఎంఎస్ ధోనీ హ్యాట్రిక్‌ సిక్సర్లు బాదినా.. రాజస్థాన్ విజయాన్ని మాత్రం అడ్డుకోలేకపోయారు.

Next Story