ఎవరీ దేవ్‌దత్‌ పడిక్కల్‌.. గూగుల్‌లో తెగ వెతుకుతున్న అభిమానులు..?

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 Sep 2020 6:09 AM GMT
ఎవరీ దేవ్‌దత్‌ పడిక్కల్‌.. గూగుల్‌లో తెగ వెతుకుతున్న అభిమానులు..?

దేవ్‌దత్ పడిక్కల్.. ఐపీఎల్‌ 13వ సీజన్‌కు ముందు ఆసక్తి రేపిన యువ ఆటగాళ్లలో ఒకడు. సోమవారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తరుపున ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఈ యువ ఆటగాడు తనపై పెట్టుకున్న అంచనాలను అందుకున్నాడు. అరగ్రేటం మ్యాచే అయినా.. ఎక్కడా ఎలాంటి భయం, బెరుకు లేకుండా హాఫ్‌ సెంచరీతో (56; 42 బంతుల్లో 8 ఫోర్లు) రాణించి బెంగళూరు భారీ స్కోర్‌ సాధించడంలో తన వంతు సాయపడ్డాడు ఈ 20ఏళ్ల కుర్రాడు. ఓ వైపు సీనియర్‌ ఆటగాడు ఫించ్‌ షాట్లు ఆడేందుకు ఇబ్బంది పడుతుంటే.. దేవ్‌దత్‌ మాత్రం స్వేచ్చగా బౌండరీలు బాదాడు. గతేడాది వేలంలోనే బెంగళూరు అతన్ని సొంతం చేసుకున్నప్పటికి తుది జట్టులో ఆడించలేదు. కానీ ఈ సారి తనను ఆడించక తప్పని పరిస్థితిని అతను కల్పించాడు.

తొలిసారి ఐపీఎల్‌ మ్యాచ్‌ ఆడుతున్న ఈ కుర్రాడి గురించి బెంగళూరు అభిమానులు తెగ గూగుల్‌ చేశారు. హైదరాబాద్‌ బౌలర్లపై విరుచుకుపడ్డ పడిక్కల్ 2000వ సంవత్సరం జూలై 7న కేరళ రాష్ట్రంలోని ఎడప్పల్‌లో జన్మించాడు. 2011లో తన కుటుంబం హైదరాబాదు నుంచి బెంగళూరుకు వలస వెళ్లింది. అక్కడే కర్నాటక ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ క్రికెట్‌లో శిక్షణ పొందాడు. 2014లో తొలిసారిగా కర్నాటక అండర్ -16 మరియు అండర్ -19 మ్యాచ్‌తో ప్రొఫెషనల్ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2017లో కర్నాటక ప్రీమియర్ లీగ్‌లో బళ్లారి టస్కర్స్ తరపున ఆడాడు. 2018-19లో కర్నాటక తరపున తొలిసారిగా రంజీ ట్రోఫీతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత 2019 ఐపీఎల్ టోర్నీకి పడిక్కల్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కొనుగోలు చేసింది. అయితే.. ఆ ఏడాది తుది జట్టులో ఆడే అవకాశం దక్కలేదు.

గతేడాది దేశవాలీ సీజన్‌లో సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీలో 12 మ్యాచ్‌ల్లో 580 పరుగులు, విజయ్‌ హజారే వన్డే టోర్నీలో 11 మ్యాచ్‌ల్లో 609 పరుగులు చేశారు. ఆ రెండు టోర్నీల్లో కర్ణాటక టైటిల్‌ గెలవడంలో అతడు కీలక పాత్ర పోషించాడు. నిలకడ, దూకుడు రెండూ ఉన్న దేవ్‌దత్‌.. టీ20ల్లో 175.75 స్ట్రైక్‌రేట్‌తో కొనసాగుతుండడం విశేషం. 15 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 907 పరుగులు చేశాడు. అత్యధికంగా 99 పరుగులు చేశాడు. 13 లిస్ట్ ఏ మ్యాచులు ఆడగా అందులో 650 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు ఉన్నాయి.

మొత్తానికి ఐపీఎల్‌ తొలి మ్యాచ్‌లోనే దుమ్ము లేపిన పడిక్కల్ అందరి దృష్టిని ఆకర్షించాడు. స్టైలిష్ షాట్లతో సెలెక్టర్ల దృష్టిలో కూడా పడ్డాడు. ఇక దేవ్‌దత్ ఇలాగే కొనసాగితే.. త్వరలోనే టీమ్‌ఇండియాలో అతన్ని చూడవచ్చు.

Next Story