లాక్‌డౌన్ ఎఫెక్ట్‌.. ధోనికి త‌ప్ప‌ని తిప్ప‌లు..!

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 April 2020 1:39 PM GMT
లాక్‌డౌన్ ఎఫెక్ట్‌.. ధోనికి త‌ప్ప‌ని తిప్ప‌లు..!

క‌రోనా వైర‌స్‌( కొవిడ్‌-19) దెబ్బ‌కి క్రీడారంగం కుదేలైంది. ప‌లు టోర్నీలు వాయిదా ప‌డ‌గా.. చాలా టోర్నీలు ర‌ద్దు అయ్యాయి. ఈ మ‌హ‌మ్మారి క‌ట్ట‌డి కోసం చాలా దేశాలు లాక్‌డౌన్‌ను పాటిస్తున్నాయి. దీంతో క్రీడాకారులంతా ఇళ్ల‌కే ప‌రిమితం అయ్యారు. దీంతో చాలా మంది క్రీడాకారులు సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. అప్పుడప్పుడు లైవ్‌లోకి వ‌చ్చి అభిమానుల‌తో ముచ్చ‌డిస్తున్నారు.

ఇప్ప‌టికే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా ప‌లు సార్లు లైవ్ చాట్‌లో పాల్గొన్నాడు. త‌న‌కు సంబంధించిన చాలా విష‌యాలను ఇంగ్లాండ్ మాజీ బ్యాట్స్‌మెన్ పీట‌ర్స‌న్‌తో షేర్ చేసుకున్నాడు. బుమ్రా, చాహాల్‌, రోహిత్ శ‌ర్మ‌, యువ‌రాజ్ సింగ్ వంటి క్రికెటర్లు అభిమానుల‌తో టచ్‌లోనే ఉన్నారు.

ఇదిలా ఉంటే.. టీమిండియా మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోని ఏంచేస్తున్నాడ‌నే విష‌యం ఎవ‌రికి తెలీయడం లేదు. ఐపీఎల్‌లో మెరుపులు మెరిపించి టీమ్ఇండియాలో గ్రాండ్ రీఎంట్రీ ఇద్దామ‌ని భావించిన మ‌హీకి క‌రోనా దెబ్బ కొట్టింది. క‌రోనా ముప్పుతో మార్చి 29 నుంచి ప్రారంభంకావాల్సిన ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్) ఏప్రిల్ 15 వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిదే. ఏప్రిల్ 14 వ‌ర‌కు లాక్‌డౌన్ కొన‌సాగ‌నుండ‌డంతో 15 నుంచి ఐపీఎల్ ప్రారంభం కావ‌డం క‌ష్ట‌మే. ఇక ఈ మెగా టోర్నీ ఈ ఏడాది ర‌ద్దు కానుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. మొన్న‌టి వ‌ర‌కు చైన్నైలో ఐపీఎల్ కోసం తీవ్రంగా సాధ‌న చేసిన ధోని.. ఐపీఎల్ వాయిదా ప‌డ‌డంతో జార్ఖండ్‌లోని త‌న ఇంటికి వ‌చ్చాడు.

లాక్‌డౌన్‌తో పనివాళ్లు రాక‌పోవ‌డంతో ఆ ప‌నుల‌ను స్టార్ క్రికెట‌ర్లు చేస్తున్నారు. ఓపెన‌ర్ శిఖ‌ర్ ధావ‌న్ బాత్రూమ్ క్లీన్ చేయ‌గా.. మిడిల్ ఆర్డ‌ర్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్య‌ర్ మాఫ్ కొట్టిన సంగ‌తి తెలిసిందే. మ‌రీ ధోని ఏం చేస్తున్నాడ‌నే విష‌యం తెలీదు. తాజాగా చెన్నై సూప‌ర్ కింగ్స్ ఓ పోటోను అభిమానుల‌తో పంచుకుంది. ఆ ఫోటోలో ధోని లాన్‌లో పెరిగిన గ‌డ్డిని క‌త్తిరిస్తున్నాడు. ఈ ఫోటోను ధోని భార్య సాక్షి సింగ్ తీసిన‌ట్లు తెలిపింది.కాగా.. ఈ ఫోటోపై అభిమానులు కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. స్టార్ క్రికెట‌ర్ అయినా.. పెళ్లాం బాధ‌లు త‌ప్ప‌వ‌ని ఓ అభిమాని స‌ర‌దాగా కామెంట్ చేయ‌గా.. ధోని సింప్లిసిటికి నిద‌ర్శ‌నం ఇదే నంటూ మ‌రి కొంద‌రూ కామెంట్ చేస్తున్నారు.

Next Story
Share it