రాష్ట్రపతిని కలిసిన నరసాపురం ఎంపీ.. ఏం జరిగింది.?
By సుభాష్ Published on 21 July 2020 4:53 PM ISTఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారటమే కాదు.. తరచూ హాట్ టాపిక్ గా మారుతున్నారు నరసాపురం ఎంపీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబెల్ నేత రఘురామ కృష్ణంరాజు. ఇటీవల కాలంలో సొంత పార్టీతో సున్నం పెట్టుకున్న ఆయన.. తరచూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ అందరిని చూపు తన మీద పడేలా చేసుకుంటున్నారు. తాజాగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిసిన ఆయన.. రెండు లేఖల్ని ఇచ్చారు.
రాష్ట్రపతికి రఘురామ ఇచ్చిన రెండు లేఖల్లో ఏయే అంశాల్ని ప్రస్తావించారు అన్నదిప్పుడు ఉత్కంటగా మారింది. రాష్ట్రపతి భవన్ నుంచి బయటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా భేటీలో చోటు చేసుకున్న అంశాల్ని ప్రస్తావించారు. తానిచ్చిన రెండు లేఖలు ఏమిటన్న దాని మీదా క్లారిటీ ఇచ్చారు. తాను ఇచ్చిన రెండు లేఖల్లో మొదటిది ఏపీ రాజధానిగా అమరావతిని కంటిన్యూ చేయాలని.. మరొకటి వ్యక్తిగత భద్రత గురించి ఇచ్చినట్లుగా చెప్పారు.
రాష్ట్రపతి భేటీ సందర్భంగా ఆయన మాటల్లో ఎక్కువ భాగం రాజధాని అమరావతి చుట్టూనే తిరిందన్నారు. ఎక్కువ సమయాన్ని అమరావతి గురించి ప్రస్తావించిన తీరు చూస్తే.. ఆయనకు జరుగుతున్న విషయాల మీద అవగాహన ఉందన్న విషయం అర్థమైందన్నారు. ఈ సందర్భంగా ఆయన నోటి నుంచి సంచలన వ్యాఖ్యలు వచ్చాయి. ‘ఏపీలో రాజ్యాంగ విరుద్ధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మండలిలో బిల్లు పాస్ కాకపోతే.. ఆ బిల్లు మండలి ఛైర్మన్ సెలెక్ట్ కమిటీకి పంపారు. చరిత్రలో ఎప్పుడూ లేని రీతిలో మండలి సెక్రటరీ మాత్రం దాన్ని పక్కన పెట్టారు. మండలి ఛైర్మన్ నిర్ణయాన్నే సెక్రటరీ ఒప్పుకోకపోవటం వ్యవస్థకే మంచిది కాదన్నారు. ఇప్పుడు మండలిలో అలా జరిగిందని.. రేపొద్దున శాసనసభలోనే అలా జరగొచ్చు’’ అంటూ వ్యాఖ్యానించారు.
బిల్లు పాస్ కాలేదని ఏకంగా మండలినే ఆవేశంలో రద్దు చేసేశారని.. ఇలా చేయటం ఏ మాత్రం సరికాదన్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగాలన్నారు. ఏపీ రాష్ట్ర ప్రజలంతా కోరుకుంటున్న విషయాన్ని రాష్ట్రపతికి తెలియజేశానని చెప్పారు. అమరావతే రాజధానిగా ఉంటుందని తాడేపల్లిలో జగన్ గృహప్రవేశం సందర్భంగా ఎమ్మెల్యే రోజా అప్పట్లో అన్న విషయాన్ని గుర్తు చేశారు. మరిప్పుడు మాట ఎందుకు మారుస్తున్నారు? అని ప్రశ్నించారు.
మడమ తిప్పను.. మాట తప్పను అని చెప్పే వ్యక్తి ఇప్పుడెందుకు మాట తప్పారంటూ నిలదీసే ప్రయత్నం చేసిన ఆయన.. అమరావతే మన రాజధాని.. దాన్ని కంటిన్యూ చేసేలా ప్రజలు సహకరించాలని కోరారు. ప్రభుత్వం ఏ కులాన్ని అయితే ద్వేషిస్తుందో.. ఆ కులం వారి కంటే కూడా ఎక్కువగా ఎస్సీ.. ఎస్టీల వారే గత ప్రభుత్వానికి భూములు ఇచ్చారన్నారు. వారి కోసమైనా అమరాతిని కొనసాగించాలన్నారు. రాత్రికి రాత్రి రాజధాని విశాఖకు వెళ్లిపోయినా ఫర్లేదు.. కానీ పోరాడి అమరావతే రాజధానిగా ఉండేలా చేద్దామన్నారు.
సీమ వాసులు విశాఖకు వెళ్లాలంటే.. వారి బతుకులు తెల్లారి పోతాయన్న నరసాపురం ఎంపీ.. రాజధానిగా అమరావతినే కొనసాగించాలన్నారు. గత ప్రభుత్వం అమరావతి కోసం ఎక్కువగా ఖర్చుచేసిందని.. ఇప్పుడు విశాఖ రాజధాని అంటే.. అంత డబ్బులు ఎక్కుడ ఉన్నాయి? అని ప్రశ్నించారు. ఈ విషయాన్ని కూడా ఏపీ ప్రజలు ఆలోచించాలన్నారు.