జగన్ తుగ్లక్ ముత్తాతలా ఆలోచిస్తున్నాడు
By రాణి Published on 18 Dec 2019 1:39 PM ISTరాష్ర్టంలో మూడు రాజధానులు ఉండొచ్చని మంగళవారం అసెంబ్లీ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రకటనపై విజయవాడ ఎంపీ కేశినేని నాని అసహనం వ్యక్తం చేశారు. సీఎం జగన్ రాష్ర్ట ముఖ్యమంత్రిలా కాకుండా, తుగ్లక్ ముత్తాతలా ఆలోచిస్తున్నాడని విమర్శించారు. రాష్ర్టంలోని ప్రతిగ్రామాన్ని రాజధాని తరహాలో అభివృద్ధి చేయాలి గానీ, రాష్ర్టంలో మూడు రాజధానులు పెట్టడమేమిటని ప్రశ్నించారు. జగన్ ఆచరణ సాధ్యం కాని ప్రకటనలు చేస్తున్నారని, జగన్ తానా అంటే ఆయన వెంట ఉన్న 151 ఎమ్మెల్యేలు తందానా అని పాడుతున్నారని, ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తూ రాష్ర్టంలో అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఐదు కోట్ల జనాభా ఉన్న ఏపీకి మూడు రాజధానులు అవసరమైతే 20 కోట్ల జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ర్టాల్లో 12 రాజధానులు ఉండాలని కేశినేని ఎద్దేవా చేశారు.
ఆనాడు రాజధాని అమరావతి ఏర్పాటుపై అంగీకారాన్ని తెలియజేసిన జగన్, నేడు 13 జిల్లాలకు ఒక్కరాజధాని సరిపోదని చేసిన వ్యాఖ్యలు రాష్ర్టంలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఇప్పటికే రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతు కుటుంబాలు రోడ్డెక్కి జగన్ వైఖరికి నిరసన తెలుపుతున్నారు. జగన్ ప్రకటనను వెనక్కి తీసుకోకపోతే ఆత్మహత్యలు చేసుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. మూడు రాజధానులు పెడితే జగన్ ఏ రాజధానిలో ఉంటాడని ప్రశ్నిస్తున్నారు. మూడు రాజధానుల ఏర్పాటు పై రాష్ర్టంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు జగన్ నిర్ణయాన్ని అభినందిస్తుంటే...మరి కొందరు ఇది తుగ్లక్ చర్య అని, రాష్ర్టాభివృద్ధి కుంటుపడుతుందని విమర్శిస్తున్నారు.