లాక్‌డౌన్‌: రోడ్డుపై వాహనదారుడి హంగామా.. పోలీసులను బూతులు తిడుతూ..

By సుభాష్  Published on  30 April 2020 11:00 AM GMT
లాక్‌డౌన్‌: రోడ్డుపై వాహనదారుడి హంగామా.. పోలీసులను బూతులు తిడుతూ..

కరోనా మహమ్మారితో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ఇక హైదరాబాద్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు అంతకంతకు పెరుగుతుండటంతో లాక్‌డౌన్‌ను మరింత కఠినతరం చేశారు పోలీసులు. లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చిన వాహనాలను సైతం సీజ్‌ చేసి జరిమానాలు విధిస్తున్నారు. అయితే వాహనదారులు ఇవేమి లెక్క చేయకుండా రోడ్లపైకి వస్తూ పోలీసులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. రూల్స్‌ ఉల్లంఘించవద్దని పోలీసులు ఎన్ని విధాలుగా చెప్పినా ఏ మాత్రం చెవికెక్కడం లేదు. ఈ లాక్‌డౌన్‌ పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది.

ఇక తాజాగా ఓ వాహనదారుడు పోలీసులకు చుక్కలు చూపించాడు. బైక్‌పై వెళ్తున్న ఆ వ్యక్తిని పోలీసులు ఆపినందుకు నానా హంగామా సృష్టించాడు. నగరంలోని లంగర్‌ హౌస్‌లో ట్రిప్పు ఖాన్‌ ఫూల్‌ బ్రిడ్జి దగ్గర ఏర్పాటు చేసిన చెక్‌ పోస్టు వద్ద ఈ వాహనదారుడిని పోలీసులు ఆపివేయడంతో ఆగ్రహంతో ఊగిపోయాడు. పోలీసులను బూతులు తిడుతూ వారితో వాగ్వివాదానికి దిగాడు. 'నన్నే ఆపుతావా.. మీ అంతు చూస్తాను' అంటూ వీరంగం సృష్టించాడు. పోలీసులను బూతు పదజాలంతో తిడుతూ రెచ్చిపోయాడు. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండంటూ కొద్దిసేపు వీరంగం సృష్టించాడు.

చివరికి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. కాగా, హల్‌చల్‌ చేసిన వ్యక్తి మద్యం దొరక్కా కొన్ని రోజులుగా ఎర్రగడ్డ మెంటల్‌ ఆస్పత్రిలోని అడిక్షన్‌ సెంటర్‌లో చికిత్స తీసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు.

Next Story