దేశంలో మాతృ భాషలు.. ఏ భాషను ఎక్కువగా మాట్లాడుతున్నారు..?
By సుభాష్ Published on 22 Feb 2020 12:16 PM ISTముఖ్యాంశాలు
►మొదటి స్థానంలో హిందీ
► చివరి స్థానంలో అస్సామీ
► 2001లో మూడో స్థానంలో ఉన్న తెలుగు 2011లో నాలుగో స్థానంలో
► రోజురోజుకు తగ్గిపోతున్న తెలుగు మాతృ భాష
భారతదేశంలో పదేళ్ల కోసారి జనాభా లెక్కలు నిర్వహించినట్లే మాతృ భాషల వివరాలు కూడా సేకరిస్తుంటారు. 2011 గణాంకాల ప్రకారం.. దేశ జనాభాలో అత్యధికంగా 43.63 శాతం మంది అంటే దాదాపు 53 కోట్ల మంది హిందీ ప్రధాన భాషగా మాట్లాడేవారున్నట్లు లెక్కలు చెబుతున్నాయి.
2011 జనగణన ప్రకారం.. దేశంలో 19,569 మాతృ భాషలు నమోదయ్యాయి. భాషా శాస్త్ర సిద్ధాంతాల ఆధారంగా వీటిని పరిశీలించి మొత్తం 1,369 మాతృ భాషలుగా, మరో 1,474 వర్గీకరించని ఇతర మాతృ భాషలుగానూ కుదించారు.
నాలుగో స్థానంలో తెలుగు ప్రజలు
2011 జనాభా లెక్కల నాటికి మన మాతృభాష తెలుగును మాట్లాడేవారు.. 8.11 శాతం మంది ఉన్నారు. భాషా ప్రాతిపదికన నాలుగో స్థానంలో నిలిచింది. 2001 వరకు మూడో స్థానంలో ఉన్న తెలుగు భాష శాతం.. 2011 నాటికి నాలుగో స్థానానికి చేరుకుంది. ఇక మరాఠీ మాతృభాష ను చూస్తే.. మరాఠీ ప్రజలు స్వల్ప తేడాతో మూడో స్థానంలో ఉన్నారు.
అలాగే 2011 నాటికి తమిళులు మాతృభాష మాట్లాడే ప్రజలు ఐదో స్థానంలో ఉండగా, గుజరాతీ భాష ఆరో స్థానంలో ఉంది. అలాగే ఉర్దూ భాష మాట్లాడేవారి శాతం ఏడో స్థానంలో ఉంది.
1991 నుంచి 2011 వరకు మాతృభాష మాట్లాడేవారి ఎంత శాతం..
హిదీ భాష : 1991లో 39.29 శాతం ఉండగా, 2001లో 41.03 శాతం ఉంది. అలాగే 2011లో 43.63 శాతానికి చేరుకుంది.
బెంగాళీ : 1991లో 8.30 శాతం, 2001లో 8.11శాతం, 2011లో 8.03శాతానికి పడిపోయింది.
మరాఠీ : 1991లో 7.45 శాతం, 2001లో 6.99 శాతం, 2011లో 6.86 శాతానికి తగ్గిపోయింది.
తెలుగు : 1991లో 7.87 శాతం, 2001లో 7.19 శాతం, 2011లో 6.70 శాతానికి తగ్గిపోయింది.
తమిళం : 1991లో 6.32 శాతం, 2001లో 5.91 శాతం, 2011లో 5.70 శాతానికి పడిపోయింది.
గుజరాతీ: 1991లో 4.85 శాతం, 2001లో 4.48 శాతం, 2011లో 4.58 శాతానికి చేరింది.
ఉర్దూ : 1991లో 5.18 శాతం, 2001లో 5.01 శాతం, 2011లో 4.19 శాతానికి తగ్గిపోయింది.
కన్నడ : 1991లో 3.91 శాతం, 2001లో 3.69 శాతం, 2011లో 3.61 శాతానికి పడిపోయింది.
ఒడియా : 1991లో 3.35 శాతం, 2001లో 3.21 శాతం, 2011లో 3.10 శాతానికి తగ్గిపోయింది.
మలయాళం: 1991లో 3.62 శాతం, 2001లో 3.21 శాతం, 2011లో 2.88 శాతానికి పడిపోయింది.
పంజాబీ : 1991లో 2.79 శాతం, 2001లో 2.83 శాతం, 2011లో 2.74 శాతానికి తగ్గిపోయింది.
అస్సామీ : 1991లో 1.56 శాతం, 2001లో 1.28 శాతం, 2011లో 1.26 శాతానికి పడిపోయింది.
తెలుగు మాట్లాడేవారు ఎందుకు తగ్గిపోతున్నారు..?
దేశంలో తెలుగు భాషను మాట్లాడేవారు రోజురోజుకు తగ్గిపోతున్నారు. ఇతర రాష్ట్రాల్లో, ముఖ్యంగా తమిళనాడులో స్థిరపడ్డ చాలా మంది తెలుగువారు తమ భాష తెలుగు అని చెప్పకపోవడమే కారణమని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాగా, 2006లో తమిళనాడులో సర్కార్ నిర్భంధ తమిళ బోధన చట్టాన్ని తీసుకువచ్చింది. ఆ చట్టం ప్రభావం చాలా మంది తెలుగువారిపై చూపింది. వారు తమ భాష తమిళం అని చెప్పడానికి అదో కారణమనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది.
ఎవరికైన మాతృభాషపై మమకారం ఉంటే వారు ఎక్కడికెళ్లినా.. తెలుగునే నేర్పిస్తున్నారు. ఇక ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారు తెలుగు భాష, సంస్కృతి మూలాలు కాపాడుకోవాల్సిన అవసరముంది. ఇక కర్ణాటకలో కన్నడ భాష పరిరక్షణ కోసం ఎంతో కృషి చేస్తున్నారు. పొరుగు రాష్ట్రాల్లోనూ పాఠశాలల్లో కన్నడలో బోధించే ఏర్పాట్లు చేస్తూ, తమ సంస్కృతిని పరిరక్షించుకుంటున్నారు. కర్ణాటక మాదిరిగా మనం కూడా మాతృ భాషను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. కానీ తెలుగు భాష విషయానికొస్తే అలాంటి కార్యక్రమాలు ఏవి చేయడం లేదు.
అలాగే తెలుగు భాష తగ్గిపోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచి విదేశాలకు వలసలు వెళ్లడం ప్రధాన కారణమని తెలుగు యూనివర్సిటీలో రిటైర్డ్ ప్రొఫెసర్లు అభిప్రాయపడుతున్నారు.