నిరుద్యోగులారా సిద్ధం కండి.. కేంద్రంలో 7 లక్షల ఉద్యోగాలు ఖాళీ.!
By Medi Samrat Published on 23 Nov 2019 1:11 PM ISTముఖ్యాంశాలు
- 7 లక్షల ఉద్యోగాలకు ఖాళీలు ఉన్నాయని కేంద్ర మంత్రి ప్రకటన
- బ్యాక్‌లాగ్ ఖాళీలు కూడా ప్రకటించిన మంత్రి
ఇది నిరుద్యోగులకు ఖచ్చితంగా శుభవార్తే. ఎగిరి గంతేసే తియ్యని వార్తే. కేంద్రం కొలువులున్నాయని ప్రకటించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా లక్షల్లో.. ఇంతకంటే శుభవార్త ఏముంటుంది. వివరాళ్లోకెళితే.. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాలలో దాదాపు 7 లక్షల ఉద్యోగాలకు ఖాళీలు ఉన్నాయని కేంద్రం ప్రకటించింది. కేంద్ర సహాయ మంత్రి జితేంద్రసింగ్ రాజ్యసభకు అందించిన సమాచారంలో.. గత ఏడాది మార్చి 1 నాటికి మొత్తం 6,83,823 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు.
అలాగే.. షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీలు), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీలు) ఇతర వెనుకబడిన తరగతులకు (ఓబిసి) బ్యాక్ లాగ్ రిజర్వు పోస్టుల్లో కూడా ఖాళీలు ఉన్నాయని మంత్రి చెప్పారు. రాజ్యసభకు అందించిన లిఖిత పూర్వక సమాధానంలోని డేటా ప్రకారం గ్రూప్ సీ లో మొత్తం 5,74,289, గ్రూప్ బీ లో 89,638 గ్రూప్ ఏ విభాగంలో 19,896 ఉద్యోగాలు భర్తీ కావాల్సివుందని తెలిపారు.
2019-20 సంవత్సరానికి గాను ఆయా కేంద్రప్రభుత్వ విభాగాలు అందించిన సమాచారం ప్రకారం.. 1, 05,338 పోస్టుల భర్తీ ప్రక్రియను స్టాఫ్ సెలెక్షన్ కమిషన్(ఎస్ఎస్‌సీ) ద్వారా ప్రారంభించామన్నారు. అలాగే.. 2017-18లో గ్రూప్ సీ లెవల్ 1 పోస్టుల 1,27,573 పోస్టుల భర్తీ కోసం సెంట్రలైజ్డ్ ఎంప్లాయిమెంట్ నోటిఫికేషన్స్ కింద రైల్వే మంత్రిత్వ శాఖ, ఆర్‌ఆర్‌బీ ద్వారా 1,27,573 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసినట్లు తెలిపారు. ఈ రెండేళ్లలో మరిన్ని ఖాళీలు ఏర్పడ్డాయన్నారు.
అలాగే.. గ్రూప్ సీ, లెవల్ -1లో 1,56,138 ఖాళీలను భర్తీ చేసే మరో ఐదు సెంట్రలైజ్డ్ ఎంప్లాయిమెంట్ నోటిఫికేషన్లను కూడా 2018-19లో జారీ చేసినట్లు మంత్రి తెలిపారు. ఇవే కాకుండా.. 19,522 ఖాళీలను వివిధ గ్రేడ్‌లలో భర్తీ చేయాలని నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. మొత్తంగా ఎస్‌ఎస్‌సి, ఆర్‌ఆర్‌బి, సీఈఎన్‌ల ద్వారా ఖాళీలను భర్తీ చేసే నియామక ప్రక్రియ పురోగతిలో ఉందని సింగ్ తెలిపారు.
అంతేకాకుండా.. జనవరి 1, 2019 నాటికి ఎస్సీలకు 1,713 (ఎస్‌సీ)బ్యాక్‌లాగ్ ఖాళీలు, ఎస్టీలకు 2,530 బ్యాక్‌లాగ్ ఖాళీలు, ఓబీసీలకు 1,773 బ్యాక్‌లాగ్ ఖాళీలు భర్తీ కాలేదని మంత్రి జితేంద్రసింగ్ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల పట్ల గ్రామీణ యువత ఎక్కువగా మొగ్గు చూపడం.. ఇదే సమయంలో కేంద్రం ప్రభుత్వం కూడా భారీ స్థాయిలో ఖాళీలు ఉన్నట్లు ప్రకటించడం నిరుద్యోగ యువతకు భారీ ఊరటనిచ్చినట్లయ్యింది.