దేశంలో క‌రోనా వైర‌స్ విజృంభిస్తోంది. క‌రోనా పేరు చెబితే చాలు వ‌ణికిపోయే ప‌రిస్థితులు ఉన్నాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఓ కోతుల గుంపు చేసిన ప‌నికి ఉత్త‌ర‌ప్ర‌దేశ్ వాసులు భ‌యాందోళ‌న చెందుతున్నారు. క‌రోనా అనుమానుల నుంచి సేక‌రించిన శాంపిల్స్‌ను కోతుల గుంపు ఎత్తుకెళ్లింది. ఈ ఘ‌ట‌న మేఠ‌ర్‌లోని మెడిక‌ల్ కాలేజ్ ఆవ‌ర‌ణ‌లో చోటు చేసుకుంది. కోతులు చేసిన ఈ ప‌నికి అక్క‌డి స్థానికులు భ‌యాందోళ‌న చెందుతున్నారు.

మీర‌ట్‌ మెడికల్‌ కాలేజీలో ముగ్గురు కోవిడ్ అనుమానితుల‌కు వైద్యులు క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. వీటిని ప‌రీక్షించేందుకు శుక్ర‌వారం ఓ ల్యాబ్ టెక్నీషియ‌న్ ఈ టెస్ట్ సాంపిల్స్‌ను మోసుకు వెళుతుండ‌గా ఒక్కసారిగా కోతులు అత‌నిపై మూకుమ్మడిగా దాడి చేశాయి. అత‌డి చేతిలో ఉన్న శాంపిళ్ల‌ను ఎత్తుకెళ్లాయి. వాటిని ప‌ట్టుకెళ్లడంతో వైద్యులు ఆందోళ‌న చెందుతున్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

అర‌టిపండు అనుకుందో, ఆట వ‌స్తువు అనుకుందో తెలీదు కానీ.. గుంపులోని ఓ కోతి శాంపిళ్ల‌ను నోటితో పీల్చ‌డం అందులో క‌నిపించింది. దీంతో స్థానికులు భ‌యాందోళ‌న చెందుతున్నారు. కోతుల వ‌ల్ల క‌రోనా వైర‌స్ త‌మ‌కు వ‌స్తుందేమోన‌ని భ‌య‌ప‌డుతున్నారు. ఈ ఘ‌ట‌న‌పై అట‌వీశాఖ అధికారుల‌కు ఫిర్యాదు చేసిన ప‌ట్టించుకోలేద‌న్నారు మెడిక‌ల్ క‌ళాశాల సూప‌రింటిండెంట్ డాక్ట‌ర్ ధీర‌జ్ బాల్య‌న్. ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ‌కు ఆదేశించామ‌ని, అనుమానితుల నుంచి సేక‌రించిన శాంపిళ్ల‌ను కోతులు ఎత్తుకెళ్ల‌డంతో మ‌రోసారి వారి నుంచి సాంపిళ్ల‌ను సేక‌రించామ‌న్నారు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.