కరోనా వైరస్ శాంపిళ్లు ఎత్తుకెళ్లిన కోతులు.. భయాందోళనలో స్థానికులు
By తోట వంశీ కుమార్ Published on 29 May 2020 7:29 PM ISTదేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. కరోనా పేరు చెబితే చాలు వణికిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఓ కోతుల గుంపు చేసిన పనికి ఉత్తరప్రదేశ్ వాసులు భయాందోళన చెందుతున్నారు. కరోనా అనుమానుల నుంచి సేకరించిన శాంపిల్స్‌ను కోతుల గుంపు ఎత్తుకెళ్లింది. ఈ ఘటన మేఠర్‌లోని మెడికల్ కాలేజ్ ఆవరణలో చోటు చేసుకుంది. కోతులు చేసిన ఈ పనికి అక్కడి స్థానికులు భయాందోళన చెందుతున్నారు.
మీరట్ మెడికల్ కాలేజీలో ముగ్గురు కోవిడ్ అనుమానితులకు వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించారు. వీటిని పరీక్షించేందుకు శుక్రవారం ఓ ల్యాబ్ టెక్నీషియన్ ఈ టెస్ట్ సాంపిల్స్‌ను మోసుకు వెళుతుండగా ఒక్కసారిగా కోతులు అతనిపై మూకుమ్మడిగా దాడి చేశాయి. అతడి చేతిలో ఉన్న శాంపిళ్లను ఎత్తుకెళ్లాయి. వాటిని పట్టుకెళ్లడంతో వైద్యులు ఆందోళన చెందుతున్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
అరటిపండు అనుకుందో, ఆట వస్తువు అనుకుందో తెలీదు కానీ.. గుంపులోని ఓ కోతి శాంపిళ్లను నోటితో పీల్చడం అందులో కనిపించింది. దీంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. కోతుల వల్ల కరోనా వైరస్ తమకు వస్తుందేమోనని భయపడుతున్నారు. ఈ ఘటనపై అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదన్నారు మెడికల్ కళాశాల సూపరింటిండెంట్ డాక్టర్ ధీరజ్ బాల్యన్. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని, అనుమానితుల నుంచి సేకరించిన శాంపిళ్లను కోతులు ఎత్తుకెళ్లడంతో మరోసారి వారి నుంచి సాంపిళ్లను సేకరించామన్నారు.