ఆరోజు నా భార్య గుర్తుకురాకుంటే.. ఆత్మ‌హ‌త్య చేసుకునేవాడిని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 April 2020 9:40 PM IST
ఆరోజు నా భార్య గుర్తుకురాకుంటే.. ఆత్మ‌హ‌త్య చేసుకునేవాడిని

ఆస్ట్రేలియా క్రికెట‌ర్ మోజెస్ హెన్రిక్స్ సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించాడు. ఓకానొక ద‌శ‌లో ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌ని అనుకున్నాన‌ని చెప్పాడు. వేగంగా కారును డ్రైవ్ చేసుకుంటూ వెళ్లి పిల్ల‌ర్‌ను ఢీకొట్టి చ‌నిపోవాల‌ని ఫిక్స్ అయ్యాయ‌ని అయితే.. ఆ స‌మ‌యంలో త‌న భార్య గుర్తుకు రావ‌డంతో ఆ ప్ర‌య‌తాన్ని విర‌మించుకున్నాన‌ని తెలిపాడు.

తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ఈ ఆల్‌రౌండ‌ర్ మాట్లాడుతూ.. 2017లో చాలా డిప్రెష‌న్ గుర‌య్యాయ‌ని, మాన‌సికంగా చాలా స‌త‌మ‌త‌మ‌య్యాయ‌ని చెప్పాడు. గూగుల్‌లో శోధించి మ‌రీ మాన‌సిక ఆందోళ‌న నిజ‌మా కాదా అని తెలుసుకున్నానని, మాన‌సిక ఆందోళ‌న నిజ‌మేన‌ని నిర్థారించుకున్నాన‌న్నాడు. "ఎక్కువ సేపు ప‌డుకోవాల‌ని ఉండేది. మందులు కోసం తీవ్రంగా ప్రయత్నించా. విశ్రాంతి తీసుకోవడానికి మత్తు మందులు వాడాలనిపించింది. అసలు ఆలోచనలు లేకుండా ఉండటం కోసం మందులు వేసుకోవాలనుకునే వాడిని. ఇలా ఒకానొక సమయంలో బ్యాంక్స్‌టౌన్‌ నుంచి ఇంటికి కారులో వస్తుండగా చనిపోవాలని అనిపించింది".

'అప్ప‌డు కారు వేగాన్ని 110 కిమీల‌కు పెంచి వేగంగా వెళ్లి ఏదో పోల్‌ను ఢీ కొట్టాల‌నిపించింది. అయితే.. ఏదో ప్ర‌మాదంలా కాకుండా నేరుగా పోల్‌కే గుద్దేయాల‌ని బావించా.. ఆ స‌మ‌యంలో నా సోద‌రులు, నా భార్య గుర్తుకువ‌చ్చారు. నా భార్య‌ను ఒంటరిని చేయాల‌నించ‌లేదు. నా సోద‌రుల‌ను విడిచి వెళ్లాల‌నించలేదు. దీంతో ఆ ప‌ని త‌ప్పు అని బావించి ఆ ప్ర‌య‌తాన్ని విర‌మించా. న‌న్ను ప్రేమించే వారి కోసం బ‌త‌కాల‌నుకున్నా. దాంతో ఒక్క‌సారిగా ఏడుపు వ‌చ్చేసింది. ఆ ఆలోచ‌న నుంచి బ‌య‌ట‌ప‌డ‌డానికి రెండు రోజుల పాటు 10 మందితో కూడిన నా జ‌ట్టుతో పాటే ఉన్నాన‌ని' అన్నాడు. 33 ఏళ్ల ఆల్‌రౌండర్ ఆసీస్ త‌రుపున 11 వన్డేలు, 11 టీ20, 4 టెస్టులు ఆడాడు. ఇక మ‌రో ఆసీస్ ఆల్‌రౌండ‌ర్ మాక్స్‌వెల్ కూడా మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతూ.. కొంత కాలం క్రికెట్ నుంచి విరామం తీసుకున్న సంగ‌తి తెలిసిందే.

Next Story