గత ఆరు సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన నిధుల వివరాలను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు తెలంగాణకు లక్షా 50 వేల కోట్లకుపైగా నిధులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. సోమవారం లోక్‌సభలో కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చారు. కేంద్ర సర్కార్‌ ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని, మోదీ సర్కార్‌ తెలంగాణపై వివక్షత చూపుతోందని వస్తున్న విమర్శల నేపథ్యంలో నిర్మలాసీతారామన్‌ నిధుల వివరాలను రాత పూర్వకంగా వెల్లడించారు.

తెలంగాణ రాష్ట్రానికి ఆరేళ్ల కాలంలో పన్నుల వాటా కింద రూ. 85,013 కోట్లు, రాష్ట్రాల విపత్తు నిధి కింద రూ. 1289,04 కోట్లు అందించినట్లు చెప్పుకొచ్చారు. ఇక స్థానిక సంస్థల నిధుల నుంచి రూ.6,511 కోట్లు, వెనుకబడిన జిల్లాలకు స్పెషల్‌ ప్యాకేజి కింద రూ. 1,916 కోట్లు, కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ నుంచి రూ.3,853 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. అలాగే కేంద్ర ప్రాయోజిత్‌ స్కీమ్స్‌, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద రూ.51,298,84 కోట్లు, మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి రూ.1500.54 కోట్లు అందించినట్లు మంత్రి లిఖత పూర్వకంగా సమాధానం ఇచ్చారు.

మంత్రి వెల్లడించిన నిధులు మొత్తం 1,51,380 కోట్లు ఉన్నాయి.2014-15లో తెలంగాణ రాష్ట్ర మిగులు రెవెన్యూ ఉన్నరాష్ట్రంగా ఉందని, ఆ తర్వాత క్రమ క్రమంగా అప్పులు పెరిగిపోయాయని నివేదికలో పేర్కొన్నారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.