రికార్డు సమయంలో సిద్ధం.. ఇక రోజుకు 1000కి పైగా శాంపుల్స్ మీద టెస్టింగ్

By న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 23 April 2020 3:42 PM IST

రికార్డు సమయంలో సిద్ధం.. ఇక రోజుకు 1000కి పైగా శాంపుల్స్ మీద టెస్టింగ్

హైదరాబాద్ లో మొబైల్ వైరాలజీ సెంటర్ ను గురువారం మధ్యాహ్నం 12:30కి రాష్ట్ర, కేంద్ర మంత్రులు ప్రారంభించనున్నారు. అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో కూడిన మొబైల్ కంటైన‌ర్ బీఎస్ఎల్ 3 వైరాల‌జీ ప్ర‌యోగ‌శాల‌ను డిజైన్ చేశారు. ICOMM, MEILగ్రూప్ సహకారంతో దీన్ని రూపొందించారు. డి.ఆర్.డి.ఓ. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన చేసింది. కోవిడ్-19 కేసుల‌ను అరిక‌ట్ట‌డానికి వైద్య శాస్త్ర‌వేత్త‌ల బృందం దేశంలోనే మొట్ట‌మొద‌టి బీఎస్ఎల్ 3 వైరాల‌జీ ప్ర‌యోగ‌శాల‌ను సిద్ధం చేశారు. ESI మెడికల్ కాలేజీ ఆవరణలో ఈ మొబైల్ వైరాలజీ సెంటర్ ను ఏర్పాటు చేశారు. రోజుకు 1000కి పైగా శాంపుల్స్ మీద టెస్టింగ్ చేయొచ్చు.

నిమ్స్ హాస్పిట‌ల్ రీసెర్చ్ డెవ‌ల‌ప్‌మెంట్ అధిప‌తి ప్ర‌ముఖ శాస్త్ర‌వేత్త డాక్ట‌ర్ కె. మ‌ధుమోహ‌న్ రావు ల్యాబ్ రూప‌క‌ల్ప‌న డిజైన్‌ను అందించారు. తెలంగాణ రాష్ట్రంలో మరిన్ని మొబైల్ వైరాలజీ తీసుకు వస్తామని కొద్దిరోజుల కిందట తెలంగాణ హెల్త్ మినిస్టర్ తెలిపారు. ఈరోజు మొబైల్ వైరాలజీ సెంటర్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు. ఇప్పటి దాకా అమెరికా, యూర‌ప్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఇటువంటి ప్ర‌యోగ‌శాల‌లు ఉన్నాయి. భార‌త‌దేశంలో బీఎస్ఎల్ -3 ప్ర‌మాణాల‌తో కూడిన మొబైల్ కంటైన‌ర్ వైరాల‌జీ ప్రయోగ‌శాల‌ను నిర్మించ‌డం ఇదే తొలిసారి. అది కూడా అతి తక్కువ సమయంలో దీన్ని రూపొందించారు. ఒక్క కరోనా మహమ్మారికి సంబంధించిన పరిశోధనలే కాకుండా ఇత‌ర వైర‌స్ ల వ్యాధి నిర్ధార‌క ప‌రీక్ష‌ల‌కు, ప‌రిశోధ‌న‌ల కోసం ఈ ప్ర‌యోగ‌శాల‌ను ఉప‌యోగించ‌వచ్చు.

అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో బీఎస్ఎల్ 3 వైరాల‌జీ ప్ర‌యోగ‌శాల‌ను సిద్ధం చేయ‌డానికి క‌నీసం 6 నుంచి 7 నెల‌ల స‌మయం ప‌డుతుంది. క‌రోనా మహమ్మారితో పోరాడాలన్న దృఢసంకల్పంతో యుద్ధ ప్రాతిప‌దిక‌న కేవ‌లం 15 రోజుల్లో ప్ర‌యోగ‌శాల‌ను సిద్ధం చేసింది. I Comm, I- clean సంస్థలు రెండు కంటైన‌ర్‌ల‌లో బీఎస్ఎల్ 3 (బ‌యో సెలెవ‌ర్-3) ప్ర‌మాణాల‌తో కూడిన ప్రయోగ‌శాల‌ను అతి తక్కువ సమయంలో సిద్ధం చేశాయి. బీఎస్ఎల్ 3 ప్రమాణాలు ఉంటేనే ప్రాణాంతక వైరస్ లతో ప్రయోగాలు చేయడానికి వీలు ఉంటుంది. బీఎస్ఎల్ 3 ప్ర‌మాణాలు పాటించ‌డం వ‌ల్ల ఇందులో ప‌నిచేసే శాస్త్ర‌వేత్త‌లు, సిబ్బంది వైర‌స్ బారిన ప‌డ‌కుండా సుర‌క్షితంగా ఉంటారు.

మొబైల్ వైరాలజీ సెంటర్ ను పలు ప్రాంతాలకు తరలించే వీలు కూడా ఉంటుంది. కంటైనర్ ను భారీ ట్రక్కులను ఉపయోగించి తరలించవచ్చు.

Next Story