పీవీ కుమార్తెకు ఎమ్మెల్సీ..!.. కేసీఆర్ వ్యూహం ఇదేనా..?
By సుభాష్ Published on 24 July 2020 3:54 AM GMTతెలంగాణ రాష్ట్ర శాసన మండలిలో ఖాళీగా ఉన్న గవర్నర్ కోటా స్థానాలను ఆశించే వారి సంఖ్య పెరిగిపోతోంది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సుల కోసం పలువురు టీఆర్‌ఎస్ నేతలు ఎవరికి వారు ప్రయత్నాలు జోరుగా కొనసాగిస్తున్నారు. 40 మంది ఉన్న మండలిలో.. గవర్నర్ కోటా కింద ఆరు స్థానాలు ఉంటాయి. ఇప్పటికే రెండు స్థానాలు ఖాళీ అయిపోయాయి. గతంలో గవర్నర్ కోటాలో మండలికి ఎన్నికైన రాములు నాయక్ 2018లో కాంగ్రెస్‌లో చేరడంతో టీఆర్‌ఎస్ నుంచి సస్పెండ్ అయ్యారు. ఇక ఆయన పదవీకాలం ఈ ఏడాది మార్చి నెలలోనే ముగిసింది. గతంలో గవర్నర్ కోటాలో మండలికి నామినేట్ అయిన ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్ పదవీ కాలం ఈ ఏడాది ఆగస్ట్ 17తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలను దక్కించుకోవడం కోసం పలువురు నేతలు ఎవరికి వారు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అయితే దివంగత మాజీ ప్రధాని, ఆర్థిక సంస్కరణల కర్త పీవీ నర్సింహారావు శత జయంతి ఉత్సవాలను తానే స్వయంగా చేపట్టి కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో ముందడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా, పీవీ నర్సింహారావు కుమార్తె, విద్యా సంస్థల అధినేత సురబీ వాణీదేవికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టేందుకు టీఆర్‌ఎస్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఇక మాజీఎమ్మెల్సీ రాములున ఆయక్, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి స్థానాలు ప్రస్తుతం ఖాళీ కాగా,ఆగస్టులో ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ పదవీ కాలం పూర్తికానుంది. ఈ మూడు స్థానాలు గవర్నర్ కోటాలోనివే. అయితే కర్నె ప్రభాకర్, నాయినిలను రెన్యువల్ చేయడం దాదాపుగా ఖాయమైనట్లు టీఆర్‌ఎస్ నేతల ద్వారా సమాచారం. ఇక మూడో సీటు కోసం పలువురు సీరియర్ నేతలు ఎవరికి వారు ప్రయత్నాలు ముమ్మరం చేసుకుంటున్నారు. అధినేత కేసీఆర్ ఆశీస్సుల కోసం పైరవీలు కొనసాగిస్తున్నారు. ఈనేపథ్యంలో పీవీ నర్సింహారావు సెంటిమెంట్‌తో కాంగ్రెస్‌ను దెబ్బకొట్టి తమకు అనుకూలంగా మలుచుకునేందుకు టీఆర్‌ఎస్ ప్రయత్నిస్తోందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో కాంగ్రెస్‌ను భుజానికి ఎత్తుకుని ఆదుకున్న పీవీకి ఆ పార్టీ సరైన గుర్తింపు గౌరవం ఇవ్వలేదన్న ఆవేదన పీవీ కుటుంబంలో ఉంది.
అలాగే బాబ్రీ మసీదు కూల్చివేత అంశం, ఇతర కారణాల వల్ల కాంగ్రెస్‌పార్టీ అధిష్టానం పీవీని తమ వాడిగా గుర్తించడం లేదు.. ఆయనకు ఇవ్వాల్సిన గుర్తింపును సైతం ఇవ్వకపోవడం, పీవీ మరణించిన తర్వాత ఆయన భౌతికకాయాన్ని ఏఐసీసీ కార్యాలయం లోపలికి తీసుకెళ్లకపోవడం వంటి పరిణామాలతో తెలుగు ప్రజల్లో ఆయనప పట్ల సానుభూతి మరింత పెరిగింది. పీవీ అంటే తెలంగాణ ప్రజల్లో ఎంతో గౌరవం ఉంది. ఈ పరిణామాలన్నీ తమకు అనుకూలంగా మలుచుకోవాలని టీఆర్‌ఎస్ భావిస్తున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
ఇక పీవీ శత జయంతికి ఏడాది ముందే పావులు కదిపిన అధికార పార్టీ.. ప్రభుత్వం తరపున ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఎంపీ కేకే నేతృత్వంలో కమిటీ వేసి, అందులో పీవీ కుటుంబ సభ్యులకు చోటు కల్పించింది. తాజాగా ఆయన కుమార్తె వాణీదేవికి ఎమ్మెల్సీ పదవీని కట్టబెట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అలాగే జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు ఈ పరిణామాలను కేసీఆర్ అవకాశంగా వాడుకోవాలని చూస్తున్నారని రాజకీయ నేతల్లో చర్చ జరుగుతోంది.