అలా నన్ను కలిసే ప్రయత్నం చేయొద్దు.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన ప్రకటన..!
By రాణి Published on 30 Dec 2019 3:37 PM ISTఏపీ అధికార పార్టీ వైసీపీ ఎమ్మెల్యే ఒకరు అలా అయితే తనను కలిసే ప్రయత్నం అస్సలు చేయొద్దంటూ సంచలన ప్రకటన చేశారు. అదేంటి..? ప‌్రజలు ఓట్లు వేయడం వలనే కదా ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టింది. అటువంటిది ప్రజలు ఎన్నుకున్న నాయకుడి స్థానంలో ఉండి వారినే కలవొద్దని హుకుం జారీ చేస్తారా..? అంటూ ఈ కథనాన్ని చదువుతున్న మీరు సీరియస్ అవొచ్చు. కానీ, ఆ ఎమ్మెల్యే చెప్పిన మాటలకు మాత్రం ఆ నియోజకవర్గ ప్రజలు జేజేలు పలుకుతున్నారు.
అంతేకాదు, పూలు సాయంత్రానికల్లా వాడిపోతాయి. ఇక బొకేల పరిస్థితీ అంతే. ఇక టపాసులంటారా? అవి క్షణాల్లో పేలిపోతాయి. అలా అనీ ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టారో మనీ వేస్ట్. నో యూజ్. అవన్నీ వద్దన్నారు కదా అని తిను బండారాలతో నన్ను కలవడానికి వచ్చారో అస్సలు.. అస్సలంటే.. అస్సలు బాగుండదు ఇప్పుడే చెప్తున్నా.. అంటూ తన నియోజకవర్గ ప్రజలకు మీడియా మైకుల ద్వారా హితబోధ చేశారు. ఇంతలా మీడియా ముందు ప్రసంగాలిస్తున్న ఆ ఎమ్మెల్యే ఎవరో తెలుసుకోవాలని మీకూ ఉందా..? అయితే ఇంకెందుకు ఆలస్యం.. ఆయనే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.
ప్రజలకు హితబోధ చేసిన ఎమ్మెల్యే..
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఇటువంటి ప్రకటన చేయడం వెనుక చాలా పెద్ద మేటరే ఉంది. అయితే, ఇంకొక్క రోజు గడిస్తే చాలు 2019కి వీడ్కోలు 2020కి వెల్కమ్. అదేనండీ నూతన సంవత్సరం. ఇక న్యూ ఇయర్ అన్నాక సంబరాలు.. ఆడంబరాలు లేకుండా ఉంటాయా..? అసలే సంవత్సరం మొదటి రోజు. ఆ ఒక్క రోజు సంతోషంగా ఉంటే చాలు.. సంవత్సరమంతా హ్యాప్పీనెస్ తోడుంటుందన్న నమ్మకం. దాంతో జనవరి 1న వేడుకలు అంబరాన్నంటాల్సిందేనని అందరూ భావిస్తుంటారు. ఆ కోవలోనే నియోజకవర్గ ప్రజలు తమ ఎమ్మెల్యేలను కలిసి శుభాకాంక్షలు చెప్పడంతోపాటు వారి అభిమానులు ఫ్లెక్సీలు, బ్యానర్లను వందల సంఖ్యలో కట్టడంతోపాటు టపాసుల మోత ఓ రేంజ్‌లో ఉండేలా చూస్తారు. కానీ, అటువంటి ఆడంబరాలు తన పేరిట చేస్తే అస్సలు సహించనంటూ కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తెగేసి చెప్పేశాడు. ఇదే విషయమై మీడియాతో మాట్లాడిన ఆయన తాను ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్న నాటి నుంచి ఎలాంటి సంప్రదాయాలను పాటిస్తున్నానో.. రానున్న నూతన సంవత్సర వేడుకలో కూడా దాన్నే పాటిస్తున్నానన్నారు. ఆ నూతన సంవత్సరం పేరు చెప్పి తన పేరిట కొన్ని కోట్ల రూపాయల ప్రజా ధనం వృధా కావడం తనకు ఇష్టం లేదన్నారు. పూలు, బొకేలు, పండ్లు, కేకులు, టపాసుల పేరుతో చేసే హంగు ఆర్భాటాలకు తాను దూరమన్నారు. అలా చేస్తే ఎవ్వరికీ ఉపయోగం ఉండదన్నారు.
నూతన సంవత్సరం రోజున కేవలం క్యాలెండర్‌లోని తేది మాత్రమే మారుతుందని నమ్మే వ్యక్తుల్లో తానూ ఒకడినన్నారు కోటంరెడ్డి. ఆ రోజున సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లయితే ఆ సంవత్సరం అంతా మనతోపాటు, మన కుటుంబాలు సంతోషంగా సంతోషంగా ఉంటాయి. అందువల్ల నా నియోజకవర్గ ప్రజలకు, శ్రేయోభిలాషులకు, స్నేహితులకు, నన్ను ఇష్టపడే వారికి తేల్చి చెప్పేది ఒక్కటే. ఎవ్వరూ కూడా నా పేరుపై ఫ్లెక్సీలు కట్టవద్దు. డబ్బులు వృథా చేయొద్దు. టపాసులు కాల్చొద్దు, బొకేలతో నన్ను కలిసే ప్రయత్నం అస్సలు చేయొద్దు అంటూ నూతన సంవత్సర వేడుకలపై స్పష్టత ఇచ్చారు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.