కరోనా వేళ.. నిన్ను నీకు గుర్తుచేసే మిట్టపల్లి పాట..
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 17 May 2020 4:42 AM GMTకరోనా.. చైనాలో పుట్టి ప్రపంచ దేశాలన్నింటికి వ్యాపించిన ప్రమాదకర వైరస్. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా మూడు లక్షల మంది ప్రాణాలు కోల్పోగా.. 40 లక్షల మంది బాధితులున్నారు. ఇక ఇండియాలో 90,927 మంది కరోనా బారిన పడగా.. 2872 మంది మృత్యువాత పడ్డారు. ప్రమాదకర ఈ వైరస్ కారణంగా భారత్‌తో పాటు దాదాపు ప్రపంచ దేశాలన్ని లాక్‌డౌన్ ప్రకటించాయి.
ఈ తరుణంలో వైరస్ కట్టడి కొరకు శాస్త్రవేత్తలు, అధికార యంత్రాంగం, ప్రభుత్వాలు ఎన్నో సలహాలు, సూచనలు చేశారు. ఇక మన తెలుగు నాట కవులు, సంగీత దర్శకులు కరోనా పట్ల ప్రజలకు అవగాహన కలిగే విధంగా ఎన్నో పాటలను సైతం విడుదల చేశారు. అయితే.. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో గొప్ప పాటలను రాసిన మిట్టపల్లి సురేందర్.. తాజాగా రచించి.. స్వయంగా ఆలపించిన పాట మనం మరచిపోయిన కట్టుబాట్లను తట్టిలేపుతుంది.
మిట్టపల్లి సురేందర్ కొత్త పాట వినరండయా.. చైన వాడి విధ్వంస కాండ పేరుతో యూ ట్యూబ్‌లో రిలీజైన.. కరోనా నుండి బయటపడితే.. బతికి బట్టకడితే అంటూ మొదలైన ఈ పాట.. కష్ట కాలంలో దేశమంతా ఐక్యతగా ఉండాల్సిన అవసరాన్ని.. ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన చైనా మార్కెట్ ఎలా మన కట్టుబాట్లను మనకు దూరం చేసిందనేది మనకు అవగతమయ్యేలా అర్థవంతంగా రచించారు. పుట్టినోడికి ఆటబొమ్మ దగ్గరనుండి కోట్లాది కూలీల పొట్ట కొట్టేలా వ్యవసాయ పనిముట్ల వరకూ చైనా మార్కెట్‌పై మనమెంత ఆధారపడ్డమనేది ఈ పాటలో కళ్లకు కట్టినట్లు చెప్పారు మిట్టపల్లి.
ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. పాట విన్న నెటిజన్లు తమదైన కామెంట్లతో ఆకట్టుకుంటున్నారు. ఓ నెటిజన్.. నేనెప్పుడూ వినలేదు కాలజ్ఞానం.. మొన్నే విన్న విధ్వంస జ్ఞానం.. విన్నాక వచ్చింది నాకు జ్ఞానం.. నీ లెక్క లేదయ్య ఎవరి గానం.. నీతల్లి నికిచ్చింది ఎంతో జ్ఞానం.. ఆ జ్ఞానానికే నా వందనం అంటూ మిట్టపట్టి పాటను కొనియాడుతూ కవితాత్మకంగా కామెంట్ సంధించాడు. ఓ మనిషిని ఇంతలా కదిలించే శక్తి.. సాహిత్యానికి మాత్రమే ఉంది. మిట్టపల్లి సురేందర్ ఇలాంటి మరెన్నో పాటలతో మనల్ని సంఘటితం చేయాలని కోరుతూ.. పూర్తి పాటకై లింక్ క్లిక్ చేయండి.