ముఖ్యాంశాలు

  • తప్పిపోయిన ఏడేళ్లకు తల్లిదండ్రుల చెంతకు
  • రంగారెడ్డి జిల్లా తల్లకొండపల్లికి చెందిన ఖాసిం

రంగారెడ్డి: టిక్‌ టాక్‌ వీడియో ఓ తల్లి కడుపు కోతను తీర్చింది. తిరిగి తన కొడుకును దగ్గరకు చేర్చింది. ఏడేళ్ల క్రితం తప్పిపోయిన కుమారుడు.. ఆచూకీ లభించడంతో ఆ తల్లిదండ్రుల ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. తలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన కుమ్మరి పెంటయ్య, పద్మమ్మలకు ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. కొడుకు ఖాసింకు చిన్నప్పటి నుంచే మాటలు రావు. తరచూ ఖాసిం ఇంటి నుంచి వెళ్లిపోయేవాడు. తల్లిదండ్రులు ఖాసింను వెతికి తిరిగి ఇంటికి పట్టుకొచ్చే వారు. అలా ఖాసిం గత ఏడేళ్ల నుంచి క్రితం తప్పిపోయాడు. ఖాసింకు అప్పటికి 15 ఏండ్లు. మళ్లీ ఖాసిం ఇంటికి తిరిగి రాలేదు. అప్పటి నుంచి తల్లిదండ్రులు కాళ్లరిగేలా వెతికారు. కొన్నాళ్లకు దొరుకుతాడన్న ఆశలు ఆవిరి అయ్యాయి.

ఈ క్రమంలో వారం రోజుల కిందట యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం కొల్లూరు గ్రామానికి చేరుకున్న ఖాసింను కొందరు స్థానిక యువకులు చూశారు. అతడి పూర్తి వివరాలను టిక్‌టిక్‌ వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెట్టారు. కాగా ఈ వీడియో చూసిన తలకొండపల్లికి చెందిన కొందరు యువకులు.. కొల్లూరు గ్రామంలో ఖాసిం ఉన్నాడని.. అతడి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. తీరా అక్కడికి వెళ్లిన వారికి కొడుకు ఖాసిం కనిపించలేదు. మళ్లీ నిరాశే ఎదురు అయ్యింది. మూడు రోజుల పాటు కొల్లూరు గ్రామస్తుల దగ్గర ఉన్న ఖాసింను.. ఆగ్రామస్తులు రాజాపేట పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తమ కొడుకు ఎక్కడ అని పోలీసులను అడిగారు. ఉదయం టిఫిన్‌ చేయడానికి బయటకు వెళ్లాడని పోలీసులు సమాచారం ఇచ్చారు. మళ్లీ ఖాసిం ఎటో వెళ్లిపోయాడు.

ఖాసిం ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు తిరిగి ఇంటికి చేరుకున్నారు. కాగా శనివానం సాయంత్రం తలకొండపల్లికి చెందిన ఓ యువతి పనిమీద సికింద్రబాద్‌ వెళ్తుండగా.. ఖాసింను గుర్తించింది. వెంటనే అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. సికింద్రాబాద్‌ నుంచి సంతోష్‌నగర్‌ వరకు తనతో పాటు ఖాసిం తీసుకువచ్చి.. వారి బంధువులకు అప్పగించింది. అక్కడి నుంచి కొడుకును తీసుకొని తల్లిదండ్రులు తలకొండపల్లికి చేరుకున్నారు. కొడుకు తిరిగి ఇంటికి రావడంతో ఆ తల్లిదండ్రులు ఆనంద బాష్పాలు రాల్చారు.

ఖాసిం తల్లి మాట్లాడుతూ.. తన కొడుకు కోసం తిరగని చోటు లేదన్నారు. అయితే చివరికి తన కొడుకు బతికి ఉన్నాడని టిక్‌టాక్‌ వీడియోనే తనను బతికించిందంటున్నారు. ఖాసిం ఆచూకీని వీడియో ద్వారా తెలిపిన యువకులకు జన్మంతా రుణపడి ఉంటానని ఆమె చెబుతున్నారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.