భానుమతి… హైబ్రిడ్ పిల్ల… ఒకే ఒక్క పీస్…. ఫిదా చిత్రంలో సాయి పల్లవి డైలాగ్ గుర్తుంది కదూ.. ఇప్పుడు వరాహానికి వానరానికి పుట్టిన రెండు హైబ్రిడ్ పిల్లలు ఇదే డైలాగ్ చెప్పబోతున్నాయి. ఒక్కటే తేడా…. ఒకే ఒక్క పీస్ కాదు. రెండు పీస్ లు. చైనాలోని ఒక లాబరేటరీలో శాస్త్రవేత్తలు కోతి, పందిలకు హైబ్రిడ్ సంతానాన్ని సృష్టించారు. బీజింగ్ లోని స్టేట్ కీ లాబరేటరీ ఆఫ్ స్టెమ్ సెల్ అండ్ రీప్రొడక్టివ్ బయాలజీ అనే పరిశోధన శాలలో ఈ విశ్వామిత్ర సృష్టి జరిగింది. స్పానిష్ శాస్త్రవేత్ జువాన్ కార్లోస్ ఇజిపిసువా బెల్మాంటె గతంలో మనిషికి పందికి మధ్య హైబ్రిడ్ ను సృష్టించిన నేపథ్యంలో ఈ ప్రయోగాలు జరిగాయి. కోతుల్లోని గుండె, కాలేయం, చర్మం కోతి కణాలను నాలుగు వేలకు పైగా పంది అండాలతో ఫలదీకరణం చేయించిన కారణంగా ఈ హైబ్రిడ్ లు పుట్టుకొచ్చాయి. ఈ ప్రయోగం ద్వారా పది పంది పిల్లలు పుట్టాయి. కానీ వాటిలో రెండింటికి మాత్రం కోతి లక్షణాలు ఉన్నాయి. ఈ రెండింటిలో కోతి కణాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు నిర్ధారించారు.

అయితే ఇలాంటి ప్రయోగాల పట్ల ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత వస్తోంది. నైతిక కారణాల వల్ల ఇలాంటి ప్రయోగాలు చేపట్టరాదన్న వాదనలు వినవస్తున్నాయి. “మూల కణాలు మగ వీర్య కణాలుగా మారితే ఏం జరుగుతుంది? స్టెమ్ సెల్స్ మానవ న్యూరాన్లుగా మారి జంతువుల మెదళ్లలోకి ప్రవేశిస్తే ఏమవుతుంది? ఇలాంటి ప్రయోగాలు అత్యంత ప్రమాదకరమైనవి” అని బార్సెలోనా రీజెనరేటివ్ మెడిసిన్ సెంటర్ కు చెందిన డా. ఆంజెల్ రాయా ప్రశ్నిస్తున్నారు. నిజమే… నరుడిని సృష్టించబోయి పొరపాటున నరకాసురుడిని సృష్టిస్తే…. ?

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.