మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం...ఆ తర్వాత బాలికకు నిప్పు
By Newsmeter.Network Published on 8 Dec 2019 5:47 PM ISTదిశ, ఉన్నావ్ ఘటనలు మరిచిపోక ముందే దారుణం చోటు చేసుకుంది. 17 ఏళ్ల బాలిక కామాంధుల చేతిలో బలైపోయింది. త్రిపుర రాష్ట్రంలో ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన సంచలనంగా మారింది. మైనర్ బాలిక (17)ను ప్రియుడు, అతడి స్నేహితులు కలిసి బంధించి ఒకరి తర్వాత ఒకరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలిని కొన్ని రోజులు పాటు బంధించి పలుమార్లు అత్యాచారం చేసి నిప్పటించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ బాలిక శనివారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. కాగా, ప్రియుడు తన తల్లితో కలిసి బాలికకు నిప్పంటించినట్టు సమాచారం.
నిందితుడి ఇంట్లో బాలికకు నిప్పంటించగా, మంటల్లో కాలిపోవడాన్ని గమనించిన స్థానికులు మంటలను ఆర్పి బాలికను వైద్య చికిత్స కోసం జీబీ పంత్ ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాలికను ఆమె ప్రియుడు రెండు నెలలుగా ఆ ఇంట్లో బంధించాడని పోలీసులు తెలిపారు. బాలిక మృతిచెందిన విషయం తెలుసుకున్న ఇరుగుపొరుగు వారు ఆస్పత్రికి తరలి వచ్చారు. ఒక దశలో నిందితులపై దాడికి దిగారు. బాధితురాలి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
50 వేలు ఇవ్వాలని డిమాండ్ :
నిందితుడు అజయ్ రుద్రపాల్ తమ కుమార్తెను బంధించి రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడని, తాము రూ.17వేలు ఇచ్చామని బాధితురాలి కుటుంబీకులు తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం బాలికకు నిప్పంటించారని పోలీసులు వెల్లడించారు. నిందితుడ్ని పోలీసులు ఆస్పత్రిలో అదుపులోకి తీసుకున్నారు. బాలికకు నిందితుడు సోషల్ మీడియా ద్వారా పరిచమై, దీపావళి తర్వాత ఆమె ఇంటికి వెళ్లి పెళ్లిచేసుకుంటానని చెప్పాడని పోలీసులు వివరించారు. తర్వాత బాలికను కిడ్నాప్ చేసి బంధించి స్నేహితులతో కలిసి ఆమెపై అత్యాచారం చేశాడని పోలీసులు పేర్కొన్నారు.
బాధితురాలి తల్లి మాట్లాడుతూ.. తమ కుమార్తె కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశామని, తర్వాత నిందితుడు ఫోన్ చేసి రూ.50 వేలు ఇస్తే మా కుమార్తెను వదలిపెడతానన్నాడని, అప్పుడు పోలీసుల్ని సంప్రదించినా ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని విలపించారు. దీంతో శుక్రవారం రాత్రి అజయ్ తల్లికి ఓ చోట కలిసి రూ.17 వేలు చెల్లించినట్లు చెప్పారు.తమ కుమార్తెను విడిచిపెట్టాలంటే మొత్తం డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేసింది.