గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌ విపత్తు నిర్వహణ కార్యాలయంలో ఎర్లీ వార్నింగ్‌ డిస్మినేషన్‌ సిస్టమ్‌ (ముందస్తు హెచ్చరికలు జారీ వ్యవస్థ)ను రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సుచరిత మట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం.. ప్రజల ప్రయోజనాల కోసం వివిధ నూతన వ్యవస్థలను ఏర్పాటు చేస్తోందన్నారు. ముందస్తు హెచ్చరికలు జారీ వ్యవస్థను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కి తీర ప్రాంతం ఒక వరమని, అర్థిక ప్రగతి అభివృద్ధికి ఇది చాలా ఉపయోగంగా ఉంటుందన్నారు.

తీర ప్రాంతాల్లో ప్రకృతి విపత్తులు కూడా ఉంటాయి కాబట్టే.. ముందస్తు హెచ్చరికల జారీ వ్యవస్థను తీసుకొచ్చామని పేర్కొన్నారు. దీని వల్ల ప్రజలు తమ ప్రాణాలను, ఆస్తి కాపాడుకోవచ్చన్నారు. ప్రకృతి విపత్తులను తెలుసుకునే వ్యవస్థలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ రెండవ స్థానంలో ఉందన్నారు. తుఫానులు, వరదల, భూకంపం, ఉప్పెనలు, సునామీలు, భారీ అగ్ని ప్రమాదాలు లాంటి ప్రకృతి వైపరీత్యాల నష్టాల తీవ్రతలను తగ్గించేందుకు ముందస్తు హెచ్చరికలు చాలా ఉపయోగపడతాయని సుచరిత అన్నారు.

Minister sucharitha launched early warning system

ఈ వ్యవస్థ ద్వారా విపత్తుల గురించి ఎప్పటికప్పుడు ప్రజలకు మొబైల్‌ ఫోన్లకు మెస్సేజ్‌లతో పాటు వాయిస్‌ మెసేజ్‌ల ద్వారా సమాచారం అందుతుందన్నారు. రాష్ట్రంలోని తొమ్మిది కోస్తా జిల్లాల్లో, 76 తీర ప్రాంత మండలాలు, 16 ఫిష్‌ ల్యాండింగ్‌ కేంద్రాలు, 8 పర్యాటక కేంద్రాల్లో ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

జాతీయ విపత్తుల సమర్థ నిర్వహణ కార్యక్రమంలో భాగంగా రూ.87 కోట్లతో ఈ ప్రాజెక్టుకు చేపట్టామని విపత్తుల శాఖ కమిషనర్‌ కె.కన్నబాబు తెలిపారు.

250 కి.మీ వరకు గాలి వేగాన్ని తట్టుకునేలా ఈ వ్యవస్థ రూపొందించబడిందిని ప్రిన్సిపాల్‌ కార్యదర్శి వి.ఉషారాణి తెలిపారు. తీవ్రమైన తుఫానుల సమయంలో ఈ వ్యవస్థ చాలా ఉపయోగపడుతుందని తెలిపారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.