ఏపీ రాజధానుల ప్రకటన పై కొత్త ట్విస్ట్

By రాణి  Published on  18 Dec 2019 10:23 AM GMT
ఏపీ రాజధానుల ప్రకటన పై కొత్త ట్విస్ట్

విజయవాడ : ఏపీలో మూడు రాజధానులు పెడతామని జగన్ చేసిన ప్రకటనపై ఆ ప్రభుత్వం కొత్త ట్విస్ట్ ఇచ్చింది. సీఎం జగన్ ఏపీలో మూడు రాజధానులు ఉండొచ్చు అన్నారు గానీ, ఉంటాయని అనలేదని, రెండింటికీ చాలా తేడా ఉందని, రాజధానులు ఏర్పాటు చేయాలంటే ముందు నిపుణుల కమిటీ నివేదిక రావాల్సి ఉంటుందన్నారు మంత్రి పేర్ని నాని. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ...ప్రతిపక్ష నేతలు జగన్ పై ఎంత ద్వేషం పెంచుకున్నారో వారు అపార్థం చేసుకుంటున్న తీరును చూస్తే అర్థమవుతుందన్నారు. రాజధాని గురించి ప్రస్తావిస్తే టీడీపీ అక్రమాలు ఎక్కడ బయటపడుతాయోనని ఆ పార్టీ నేతలు భయపడుతున్నారని పేర్ని నాని విమర్శించారు. రాజధానిపై చర్చ జరగడం ఇష్టం లేనపుడు ప్రతిపక్ష నేతలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేయొచ్చు కదా, అక్కడే ఎందుకున్నారు అని ప్రశ్నించారు. అమరావతిపై చర్చ జరిగితే టీడీపీ వాళ్లందరినీ దుస్తులు లేకుండా ప్రపంచానికి చూపిస్తామని చంద్రబాబు భయపడుతున్నారని పేర్ని విమర్శించారు.

కుక్కకి ఉండే విశ్వాసం కూడా బాబుకి లేదు

కృష్ణాజిల్లా జగ్గయ్య పేట దగ్గర్లోని జయంతి గ్రామంలో బాలకృష్ణ భూములు కొనలేదా ? చంద్రబాబు ఇంటి యజమాని లింగమనేని రమేష్ రాజధానిలో 300 ఎకరాలు కొన్నారా ? లేదా ? అని పేర్ని నాని ప్రశ్నల వర్షం కురిపించారు. రాజధాని విషయంలో మీరు చేసింది అనైతికంరా బాబు అని చెప్తుంటే చంద్రబాబు వినిపించుకోవడం లేదని, అదేమంటే దమ్ముంటే జైల్ లో వేయండని సవాల్ చేస్తున్నారని దుయ్యబట్టారు. పాపం పండిన రోజు ఎవరు జైలు కెళ్తారో అందరూ చూస్తారన్నారు. రాజధాని రైతులకు న్యాయం చేయాలని టీడీపీ అంత ప్రాకులాడితే ఐదేళ్ల పాలనలో అందరికీ ఫ్లాట్లెందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. టీడీపీ సానుభూతి పరులు, ధనవంతులకే ప్లాట్లు ఇచ్చారని, చంద్రబాబు హయాంలో పేద టీడీపీ కార్యకర్తలకు అన్యాయం జరిగిందని మంత్రి పేర్ని ఆరోపించారు. జెండా మోసినవారికి అన్యాయం జరిగితే కార్లకు జెండా కట్టుకున్న వారు బాగుపడ్డారని దుయ్యబట్టారు. చంద్రబాబు తనను నమ్మిన రైతులను నట్టేటముంచాడన్నారు. తిండి తిన్నామన్న విశ్వాసం కుక్కలకు ఉంటుంది కానీ చంద్రబాబుకు అది కూడా లేకపోయిందని, అందుకే రైతుల పట్ల అంత వివక్ష చూపారన్నారు.

Next Story
Share it