రెండు గంటల్లో తయారయ్యే మినీ ఆసుపత్రులు

By సుభాష్  Published on  17 July 2020 11:15 AM IST
రెండు గంటల్లో తయారయ్యే మినీ ఆసుపత్రులు

సంక్షోభాలు కొత్త ఆలోచనలకు కారణమవుతాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితే నెలకొంది. ఇప్పుడు నడుస్తున్నకరోనా కాలంలో అక్కడా ఇక్కడా అన్న తేడా లేకుండా ప్రతిచోట ఐసీయూ పడకల కొరత భారీగా నెలకొంది. అలా అని యుద్ధ ప్రాతిపదికన నిర్మించటం అంత తేలికైన విషయం కాదు. ఈ సమస్యకు ఐఐటీ మద్రాస్ కొత్త ఆలోచనలకు తెర తీసింది. ఒక స్టార్టప్ తో కలిసి గంటల వ్యవధిలోనే మినీ ఆసుపత్రిని నిర్మించేలా సెటప్ ఒకటి సిద్ధం చేసింది.

ఈ మినీ ఆసుపత్రిలో వైద్యుడి గదితో పాటు.. ఐసోలేషన్ గది.. చికిత్స అందించే వార్డు.. రెండు ఐసీయులతో పెద్దాసుపత్రుల్లో ఉండే వసతులన్ని ఉండేలా సిద్ధం చేశారు. ఈ తరహా మినీ ఆసుపత్రుల నిర్మాణం కోసం కేరళలోని వైనాడ్ జిల్లాలో షురూ చేశారు. అక్కడ శ్రీ చిత్ర తిరుణాళ్ ఇన్ స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ సాయం అందించింది. వాస్తవానికి ఈ స్టార్టప్ కంపెనీ గృహ నిర్మాణాన్ని చౌక చేయటమే లక్ష్యం. అయితే.. పెద్దగా గుర్తింపునకు నోచుకోలేదు. కరోనా పుణ్యమా అని ఇప్పుడీ కాన్సెప్టు అందరిని విపరీతంగా ఆకర్షిస్తోంది.

గంటల్లో ఏర్పాటు చేసుకోవటం.. అవసరానికి అనుగుణంగా అప్పటికప్పుడు ఒక చోట నుంచి మరో చోటకు తీసుకెళ్లే అవకాశం ఉండటంతో.. ఇలాంటివి ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని ప్రభుత్వాలు గుర్తిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాలు.. టైర్ త్రీ పట్టణాల్లో ఇలాంటి వాటిని ఏర్పాటు చేయటం ద్వారా.. బాధితుల్ని వేర్వేరుచోట్ ఉంచి వైద్యం చేయటం సులువుగా భావిస్తున్నారు. అంతేకాదు.. ఈ ఇళ్లను మడిచి.. ఒక లారీలో ఆరు వరకూ ఒక చోట నుంచి మరోచోటుకు తరలించే వీలుంది. కరోనా వేళ.. ఇలాంటి మినీ ఇళ్లు ప్రయోజనకరంగా ఉండటమే కాదు.. ఊరి చివర పెద్ద ఎత్తున నిర్మిస్తే.. ఎక్కడికక్కడ ఉండే వైద్య సిబ్బందితో పాజిటివ్ కేసుల్ని పెరగకుండా ఉంచే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.

Next Story