ప్రముఖ మిమిక్రీ కళాకారుడు హరి కిషన్ క‌న్నుమూత‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 May 2020 10:39 AM GMT
ప్రముఖ మిమిక్రీ కళాకారుడు హరి కిషన్ క‌న్నుమూత‌

ప్రముఖ మిమిక్రీ కళాకారుడు, నటుడు హరి కిషన్(57) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధప‌డుతున్న ఆయ‌న ఈ రోజు తుదిశ్వాస విడిచారు. హరి కిషన్ తెలుగులో.. సీనియ‌ర్ హీరోలు ఎన్టీఆర్, ఏఎన్నార్‌, కృష్ణ, శోభన్ బాబు త‌ర్వాతి త‌రం హీరోలైన‌ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేస్‌ల‌తో పాటు ఇప్పటి తరం హీరోలైన ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్ వరకు అందరి హీరోల గొంతులను అనుకరించేవారు.

అలాగే.. ఒక‌ప్ప‌టి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, వైఎస్ఆర్‌ల‌తో పాటు చంద్రబాబు, కేసీఆర్, జ‌గ‌న్ వంటి అగ్ర రాజకీయ నాయకుల గొంతులను కూడా అనుక‌రించి శభాష్ అనిపించారు. మిమిక్రీతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న హరికిషన్.. మే 30, 1963న‌ రంగమణి, వీఎల్ఎన్‌ చార్యులు దంపతులకు ఏలూరులో జన్మించారు. 8 ఏళ్ల వయసులోనే తన గురువులను.. తోటి వాళ్ల గొంతులను మిమిక్రీ చేయడాన్ని ప్రారంభించారు హరికిషన్.

అలా ప్రారంభమైన హరికిషన్ మిమిక్రీ ప్రస్థానం... ఆ తర్వాత సినీనటులు, గాయకులు, క్రికెట్ క్రీడాకారులు, రాజకీయ నాయకుల గొంతులను అనుకరిస్తూ పాపులర్ అయ్యారు. ఎన్నో ప్ర‌ద‌ర్శ‌ల ద్వారా హ‌రికిష‌న్‌ మిమిక్రీలో తన కంటూ ప్రత్యేక పేజీలు లిఖించుకున్నారు. కేవలం మ‌నుషుల గొంతులు మాత్రమే కాదు.. పశుపక్ష్యాదుల శబ్ధాలతో పాటు యంత్రాలు చేసే ధ్వ‌నులు.. సంగీత వాద్య పరికరాల సౌండ్స్‌ను తన గొంతులో పలకించడం హరి కిషన్‌కు ఉన్న‌ ప్రత్యేకత.

1971లో తొలిసారి హ‌రికిష‌న్‌ విజయవాడలో మిమిక్రీ ప్రదర్శన చేసారు. ఆ తర్వాత ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. మిమిక్రీ కళాకారుడిగా దేశ విదేశాల్లో వేలాది ప్రదర్శనలు ఇచ్చి ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు. ప్రముఖ నటుడు, మిమిక్రీ క‌ళాకారుడు శివారెడ్డికి ఈయన గురువు కూడా. ఆయన మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు అనే చెప్పాలి. ఆయన మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ.. ఆయనతో వారికున్న‌ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

Next Story