హైదరాబాద్ : సీఏఏకు వ్యతిరేకంగా హోరెత్తిన నినాదాలు
By Newsmeter.Network Published on 4 Jan 2020 5:12 PM ISTహైదరాబాద్: కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రవేశపెట్టిన ఎన్ఆర్సీ, సీఏఏ లకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుండి దళిత విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, ముస్లిం సంఘాలతో కూడిన జేఏసీ మిలియన్ మార్చ్ నిర్వహిస్తున్నాయి. ఇందిరా పార్కులోని ధర్నా చౌక్ నుండి మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయిన మిలియన్ మార్చ్ ర్యాలీ కొనసాగుతుంది. దీంతో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. భారీ ర్యాలీల ఫలితంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మిలియన్ మార్చ్‌ను విజయవంతం చేయడానికి.. సంగారెడ్డి, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ జిల్లాల నుండి పెద్ద ఎత్తున ముస్లీం సంఘాల ప్రతినిధులు, జేఏసీ నాయకులు, ప్రజలు హాజరయ్యారు. ఈ మిలియన్ మార్చ్ కార్యక్రమానికి సుమారు 60000 మందికి పైగా హాజరు కావడంతో రాజధాని మొత్తం జాతీయ జెండాలతో నిండిపోయింది. ఎన్ఆర్సీ, సీఏఏ లకు వ్యతిరేకంగా నినాదాలు మిన్నంటాయి.
ఇదిలావుంటే.. డిసెంబర్ 28నే జరగాల్సిన ఈ మిలియన్ మార్చ్ కు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంపై సవాల్ చేస్తూ.. జేఏసీ హై కోర్టును ఆశ్రయించగా..ఈ విషయాన్ని పోలీసులు మరొక్కసారి పరిశీలించాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో మిలియన్ మార్చ్ జరిగే ప్రాంతాలను పరిశీలించిన పోలీసులు.. అనుమతి ఇచ్చారు.
ఎన్ఆర్సీ, సీఏఏ లకు వ్యతిరేకంగా భాగ్యనగరంలో ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. దాదాపు 48 సంఘాలు కలిసి నిర్వహించిన ఈ మిలియన్ మార్చ్ లో పెద్ద సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు. సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ..లక్డికాపూల్ రవీంద్ర భారతి...ఆబిడ్స్ ఎల్బీ స్టేడియం మీదుగా లిబర్టీ చౌరస్తా, సికింద్రాబాద్ నుండి ఇందిరా పార్క్, ఆర్.టి.సి ఎక్స్ రోడ్ వరకూ ర్యాలీ నిర్వహించారు.
ఇందిరాపార్క్ వద్ద పౌరసత్వ సవరణ బిల్లు కు వ్యకతిరేకంగా సీఏఏ, ఎన్ఆర్సీ జాయింట్ యాక్షన్ కమిటి తలపెట్టిన నిరసన సభకు పెద్ద ఎత్తున ముస్లింలు తరలి వెళ్లారు. ప్లకార్డులు చేపట్టి, కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా చేసిన నిరసనలతో నగరం గర్జించింది.
ఈ మిలియన్ మార్చ్ కారణంగా ట్యాంక్ బండ్ పై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మిలియన్ మార్చ్ కోసం పోలీసులను ముందుగానే అనుమతి అడిగినప్పటికీ.. ట్రాఫిక్ ను కంట్రోల్ చేయడంలో వారు విఫలమయ్యారని అంటున్నారు కొందరు.
Dharna Chowk would not have seen such a crowd for a protest. #Hyderabad #CAA_NRC_Protest pic.twitter.com/cdenBiQC6k
— Rahul V Pisharody (@rahulvpisharody) January 4, 2020