జీజీహెచ్‌లో అర్ధ‌రాత్రి హైడ్రామా..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Jun 2020 6:48 AM GMT
జీజీహెచ్‌లో అర్ధ‌రాత్రి హైడ్రామా..

గుంటూరులోని జీజీహెచ్‌ వద్ద అర్థరాత్రి హైడ్రామా నడిచింది. ఈఎస్‌ఐ మందుల కొనుగోలు స్కామ్‌లో అరెస్టు అయిన మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడంతో జీజీహెచ్‌లో చికిత్స అందిస్తున్నారు. కాగా.. రాత్రి అచ్చెన్నాయుడిని డిశ్చార్జి చేస్తున్నట్లు జీజీహెచ్‌ ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. సమాచారం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు ఆస్పత్రికి చేరుకున్నాయి. అర్థరాత్రి డిశ్చార్జి ఎంటని టీడీపీ శ్రేణులు ప్రశ్నించాయి. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

అంతకముందు.. బుధవారం ఉదయం మూడు రోజుల పాటు పోలీసు క‌స్ట‌డీకి కోర్టు అనుమ‌తించింది. ఈఎస్ఐ స్కామ్‌లో అచ్చెన్నాయుడు, ర‌మేష్‌కుమార్‌తో పాటు మ‌రో ముగ్గురిని ప్ర‌శ్నించేందుకు కోర్టు అనుమ‌తి ఇచ్చింది. అచ్చెన్నాయుడు ఆరోగ్య ప‌రిస్థితి స‌రిగాలేద‌ని న్యాయ‌వాది వాదించ‌డంతో జీజీహెచ్‌లోనే ప్ర‌శ్నించాల‌ని కోర్టు ఆదేశించింది. కానీ, రాత్రి సమయంలో ఆస్ప‌త్రి నుంచి అచ్చెన్నాయుడును డిశ్చార్జి చేస్తున్న‌ట్టు ఆస్ప‌త్రి వ‌ర్గాలు ప్ర‌క‌టించాయి. ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి ఎలా చేస్తారంటూ ప్ర‌శ్నించారు అచ్చెన్నాయుడు న్యాయ‌వాది హ‌రిబాబు. ఉన్నాతాధికారులు నిర్ణ‌యం తీసుకున్నార‌ని ఏఆర్ఎంవో చెప్పుకొచ్చారు. అర్థరాత్రి సమయంలో ఆర్‌ఎంవో సతీష్‌కుమార్‌ ఆస్పత్రి చేరుకున్నారు. దీంతో న్యాయవాది హరిబాబు డిశ్చార్జి కాపీ ఇవ్వాలని పట్టుబట్టారు. ఆ వెంటనే డిశ్చార్జి రద్దు చేశామని ప్రకటించారు ఆర్‌ఎంవో. దీంతో టీడీపీ వర్గాలు శాంతించాయి.

ఈ ఘటనపై ఏపీ ప్రభుత్వ తీరును టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి విమర్శించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్ట్ నుంచి అర్ధరాత్రి బలవంతపు డిశ్చార్జి హైడ్రామా వరకు ప్రభుత్వ కక్షసాధింపు స్పష్టంగా కనిపిస్తోంది. 3 రోజులు ఆసుపత్రి బెడ్ పైనే విచారణకు అనుమతిచ్చిన కోర్టునూ ధిక్కరిస్తారా. అర్ధరాత్రి డిశ్చార్జి చేయాలని వైద్యులపై, పోలీసులపై ఒత్తిడి తేవడం దారుణమన్నారు.

Next Story