మైక్రోసాఫ్ట్ అండతో.. టిక్ టాక్ దుమ్ము దులపడం ఖాయమా..!

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Aug 2020 2:31 PM IST
మైక్రోసాఫ్ట్ అండతో.. టిక్ టాక్ దుమ్ము దులపడం ఖాయమా..!

టిక్ టాక్ కు అతి పెద్ద మార్కెట్ గా భారత్, అమెరికా అని చెబుతారు. చైనాకు చెందిన యాప్ కావడంతో భారత్ లో టిక్ టాక్ ను ఇటీవలే బ్యాన్ చేశారు. అమెరికాలో కూడా టిక్ టాక్ ను బ్యాన్ చేసే ఆలోచనలో ఉన్నట్లు ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇటీవలే తెలిపారు. టిక్ టాక్ ద్వారా చైనా అమెరికన్ల రహస్యాలను సేకరిస్తోందని ఆయన అన్నారు. అత్యవసర కార్యనిర్వాహక ఉత్తర్వులను ఉపయోగించి టిక్ టాక్ ను బ్యాన్ చేయడం కోసం వెంటనే చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. చైనా ఇంటెలిజెన్స్‌ ఈ యాప్ ద్వారా దేశ రహస్యాలను మరియు అమెరికా అధికారుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తోందని ఆయన ఆరోపించారు.

ఇక అమెరికాలో కూడా తమ సంస్థ బ్యాన్ అవ్వడం పక్కా అని భావించిన టిక్ టాక్ సంస్థ దాన్ని బేరం పెట్టింది. టిక్ టాక్ ను కొనుగోలు చేయడానికి ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ముందుకు వచ్చిందన్న వార్తలు నిజమే అయ్యాయి. ఓ తాము టిక్ టాక్ ను కొనుగోలు చేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ సంస్థ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. కొనుగోలుకు సంబంధించిన చర్చలను సెప్టెంబర్ 15 కల్లా పూర్తి చేస్తామని తెలిపింది.

టిక్ టాక్ ను కొనుగోలు చేసే విషయంపై డొనాల్డ్ ట్రంప్ అభ్యంతరం వ్యక్తం చేశారనే వార్తల నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ ప్రకటనను విడుదల చేసింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభ్యంతరాలను అర్థం చేసుకున్నామని... సమాచార భద్రతకు ముప్పు రాకుండా టిక్ టాక్ కార్యకలాపాలను స్వాధీనం చేసుకుంటామని మైక్రోసాఫ్ట్ తెలిపింది.

టిక్ టాక్ గురించి డొనాల్డ్ ట్రంప్ తో మాట్లాడానని మైక్రోసాఫ్ట్ ఛీఫ్ ఎగ్జిగ్యూటివ్ ఆఫీసర్ సత్యా నాదెళ్ల తెలిపారు. సెక్యూరిటీ పరంగా తగినన్ని జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు తీసుకుంటామని ట్రంప్ కు తెలిపినట్లు సమాచారం. అమెరికా, కెనెడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ నుండి టిక్ టాక్ కార్యకలాపాలు జరిపే అవాకాశం ఉందని మైక్రోసాఫ్ట్ తెలిపింది. మైక్రోసాఫ్ట్ అండతో టిక్ టాక్ మరింత మందికి చేరే అవకాశం ఉన్నట్లు భావిస్తూ ఉన్నారు. త్వరలో టిక్ టాక్ గ్రాండ్ రీఎంట్రీ పక్కా అనే చెబుతున్నారు.

Next Story