హైదరాబాద్: కరోనా లక్షణాలు లేని వారికే మెట్రోలో అనుమతి: ఎండీ

By సుభాష్  Published on  5 Sep 2020 10:32 AM GMT
హైదరాబాద్: కరోనా లక్షణాలు లేని వారికే మెట్రోలో అనుమతి: ఎండీ

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు సోమవారం నుంచి హైదరాబాద్‌లో మెట్రో సేవలు ప్రారంభించబోతున్నట్లు మెట్రో ఎండీ ఎన్‌వీఎస్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఎలాంటి కరోనా లక్షణాలు లేనివారికే మెట్రోరైలులో అనుమతి ఇస్తామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ .. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు చేపడుతున్నామని, సాధారణ ఉష్ణోగ్రతలు ఉంటేనే ప్రయాణించాలని కోరారు. మెట్రో సిబ్బందికి పీపీఈ కిట్లు అందజేస్తామని, స్మార్ట్‌ కార్డులు, నగదు రహిత విధానం ద్వారానే టికెట్లు జారీ చేస్తామని పేర్కొన్నారు.

అన్ని మెట్రో స్టేషన్‌లలో ఎప్పటికప్పుడు శానిటైజేషన్‌ చేయిస్తున్నామని అన్నారు. మెట్రో స్టేషన్లు, రైళ్లలో భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అలాగే మెట్రో స్టేషన్‌లలో ఐసోలేషన్‌ రూమ్‌లను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్కరు మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పని సరి అన్నారు.

కాగా, సెప్టెంబర్‌ 1 దేశంలో అన్‌లాక్‌ 4.0లో భాగంగా కేంద్ర ప్రభుత్వం పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇందులో మెట్రో రైళ్లు నడిపేందుకు అనుమతులు ఇచ్చింది. సెప్టెంబర్‌ 7వ తేదీ నుంచి మెట్రో సేవలు ప్రారంభించాలని ఆయా రాష్ట్రాలకు సూచించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో 7 నుంచి మెట్రో సేవలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది తెలంగాణ ప్రభుత్వం.

Next Story