ఆ రాష్ట్రంలో ఏప్రిల్‌ 15 తర్వాత లాక్‌డౌన్‌ పాక్షికంగా ఎత్తివేత..!

By సుభాష్  Published on  7 April 2020 10:33 AM GMT
ఆ రాష్ట్రంలో ఏప్రిల్‌ 15 తర్వాత లాక్‌డౌన్‌ పాక్షికంగా ఎత్తివేత..!

కరోనా మహమ్మారి దేశాన్ని కుదిపేస్తోంది. కరోనాను కట్టడి చేసేందుకు లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ఇక 21 రోజుల పాటు కొనసాగుతున్న ఈ లాక్‌డౌడ్‌ ఏప్రిల్‌ 14వ తేదీలో ముగియనుండటంతో లాక్‌డౌన్‌ ఎత్తివేస్తారా..? లేదా అన్నది అందరిలో కలుగుతున్న ఆందోళన. ఈ నేపథ్యంలో మేఘాలయ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్‌ 15 నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాల సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొంది. ప్రైవేటు వాహనాల రాకపోకలను అనుమతిస్తామని, విద్యాసంస్థలు మాత్రం ఏప్రిల్‌ 30 వరకు మూసి ఉంటాయని వెల్లడించింది.

అయితే మేఘాలయలో ఇంత వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్‌ 15 నుంచి పాక్షికంగా లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నారు. ఈ మేరకు కేబినెట్‌ సమావేశం అనంతరం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి. రైతులు పొలాలకు వెళ్లి పనులు చేసుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా మార్కెట్లు వారానికి ఒకసారి తెరుస్తామన్నారు. అలాగే ఉపాధిహామీ పథకం పనులు కూడా కొనసాగుతాయని తెలిపింది.

ఇక మిగతా కొన్ని రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తోంది. ఢిల్లీ నిజాముద్దీన్‌ మర్కజ్‌ ప్రార్థనల నేపథ్యంలో కరోనా కేసులు అంతకంతకు పెరిగిపోయాయి. 21రోజుల పాటు లాక్‌డౌన్ సరిపోతుంది అనుకున్న సమయంలో మర్కజ్‌ ఘటన తర్వాత కేసులన్నీ ఒక్కసారిగా పెరిగిపోయాయి. ప్రభుత్వాలు మరింత అప్రమత్తమై వారందరినీ క్వారంటైన్‌కు తరలించాయి. ఏపీ, తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య మరింత పెరిగిపోయింది. నిన్న మీడియాతో మాట్లాడిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజులు పాటించాలని ప్రధాన మోదీకి తెలిపినట్లు చెప్పారు.

కేసులు రోజురోజుకు ఎక్కువ అవుతున్న తరుణంలో మరికొన్ని రోజుల లాక్‌డౌన్ తప్పదని మోదీకి నివేదించినట్లు కేసీఆర్‌ వివరించారు. ఇక కేసీఆర్‌ బాటలోనే మరిన్ని రాష్ట్రాలు కూడా పయనిస్తున్నాయి. మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్‌, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌, కేరళ, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలు కూడా లాక్‌డౌన్‌ మరికొన్ని వారాల పాటు పొడిగించాలని కోరుతున్నాయి. లాక్‌డౌన్ పొడిగిస్తేనే కరోనా పూర్తిస్థాయిలో కట్టడి చేయగలమని స్పష్టం చేస్తున్నాయి. మరి మోదీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

Next Story