మెడికల్‌ విద్యార్థిని దారుణ హత్య

By సుభాష్  Published on  20 Aug 2020 7:08 AM GMT
మెడికల్‌ విద్యార్థిని దారుణ హత్య

దేశంలో మహిళలపై దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. హత్యలు, అత్యాచారాలు జరుగకుండా పోలీసులు ఎన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకున్నా.. ఇంకా పెరిగిపోతున్నాయి తప్ప తగ్గడం లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో మెడికల్‌ విద్యార్థిని దారుణ హత్య సంచలనం సృష్టించింది. పోస్టు గ్రాడ్యూయేట్ చదువుతున్న ఓ మెడికల్‌ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన రాష్ట్రంలోని ఆగ్రాలో చోటు చేసుకుంది. ఢిల్లీకి చెందిన 25 ఏళ్ల యువతి ఆగ్రాలోని ఓ మెడికల్‌ కళాశాలలో గైనకాలజీ విభాగంలో వైద్యురాలిగా పని చేస్తున్నారు. దీంతో పాటు పోస్టు గ్రాడ్యుయేట్‌ చదువుతోంది. అయితే జలౌన్‌ సిటీలో డాక్టర్‌గా పని చేస్తున్న ఓ వ్యక్తి ఆ యువతిని గత కొంత కాలంగా మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో మంగళవారం సాయంత్రం ఆ యువతి కనిపించకుండా పోవడంతో యువతి కుటుంబ సభ్యులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు యువతి కోసం గాలింపు చర్యలు చేపట్టగా, బుధవారం బమ్రోలి అహిర్‌ ప్రాంతంలో మృతదేహాన్ని కనుగొన్నారు. ఆమె తల, మెడపై తీవ్ర గాయాలున్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. కాగా, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. డాక్టరే తమ కుమార్తెను హత్య చేశాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సీసీటీవీ పుటేజీ ఆధారంగా డాక్టర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, ప్రస్తుతం మాస్టర్‌ సర్జరీ చదువుతున్న యువతి.. మంగళవారం వెలువడిన ఫలితాల్లో క్వాలిఫై అయినట్లు తెలుస్తోంది.

Next Story
Share it