మేడారం జాతరకు ఆర్టీసీ 'బాదుడు'
By న్యూస్‌మీటర్ తెలుగు
తెలంగాణలో అతి పెద్ద గిరిజనుల పండుగ మేడారం జాతర. వన దేవతలు 'సమ్మక్క- సారలమ్మ లను దర్శించుకోవడానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచే కాక దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం మొక్కులు బంగారం(బెల్లం) రూపంలో సమర్పిస్తారు. ఈ సారి ఈ జాతర ఫిబ్రవరి 5 నుంచి 8 తేదీ వరకు జరగనుంది. కాగా ఈ జాతరకు వెళ్లాలని అనుకునే భక్తులకు చేదు వార్త ఇది.
గతేడాది ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించాక, టికెట్ ధరలు పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో జాతరకు వెళ్లే భక్తులకు ఆర్టీసీ స్పెషల్ వడ్డన చేస్తోంది. గత నెల ఆర్టీసీ చార్జిని కిలోమీటర్కు 20 పైసల చొప్పున పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అధికారులు మేడారం జాతర కోసం కొత్తగా రేట్లను నిర్దేశించారు. జాతర సమయంలో ఒక్కో ప్రాంతం నుంచి వెళ్లే వారికి టికెట్ ధరను రూ. 30 నుంచి 50 వరకు పెంచారు. ఇలా అన్ని రూట్లలో చార్జీలు పెంచడంతో ఆ భారం భక్తులపై పడనుంది.
హైదరాబాద్ నుంచి మేడారానికి వెళ్లాలంటే ఏసీ బస్సు ఛార్జీ రూ.710కు (పిల్లలకు రూ.540) పెంచారు. సూపర్ లగ్జరీ ఛార్జీ రూ.550 (పిల్లలకు రూ.290), ఎక్స్ప్రెస్ ఛార్జీ అయితే రూ.440 (పిల్లలకు రూ.230) చెల్లించాలి. 2018 మేడారం జాతరలో ఎక్స్ప్రెస్ ఛార్జీ పెద్దలకు రూ.360 కాగా ఇప్పుడు రూ.440 చేయడంతో రూ.80 పెరిగింది.
ముఖ్యమైన వివిధ ప్రాంతాల నుంచి జాతరకు బస్ చార్జీల వివరాలు(ఎక్స్ ప్రెస్)
హైదరాబాద్ నుంచి రూ.440
వరంగల్ నుంచి రూ.190
ఏటూర్ నాగారం నుంచి రూ.60
ఘణపురం(ము) నుంచి రూ.140
కాటారం నుంచి రూ.210
పరకాల నుంచి రూ.190చిట్యాల నుంచి రూ.200
కాళేశ్వరం నుంచి రూ.260
భూపాలపల్లి నుంచి రూ.180
కొత్తగూడ నుంచి రూ.240
నర్సంపేట్ నుంచి రూ.190
మహబూబాబాద్ నుంచి రూ.270
సిరోంచ నుంచి రూ.300
తొర్రూర్ నుంచి రూ.280
వర్ధన్నపేట్ నుంచి రూ.230
స్టేషన్ ఘన్పూర్ నుంచి రూ.240
జనగామ నుంచి రూ.280 వసూలు చేయనున్నారు.
ఇదిలా ఉండగా 2018లో 17.64 లక్షల మందిని 3,563 బస్సుల ద్వారా జాతరకు తరలించగా ఆర్టీసీ రూ.23కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఈ సారి జాతర కోసం ఏకంగా 4వేల బస్సులను నడపనున్నారు. వీటి ద్వారా 23లక్షలకు పైగా భక్తులను చేరవేసి రూ.30కోట్ల వరకు ఆదాయాన్ని ఆర్జించాలని ఆర్టీసీ బావిస్తోంది.