మేడారం జాతర కోసం గొంతు కలిపిన బిగ్ బి

By రాణి  Published on  25 Jan 2020 11:19 AM IST
మేడారం జాతర కోసం గొంతు కలిపిన బిగ్ బి

తెలంగాణ రాష్ర్ట ప్రతిష్టాత్మకమైన పండుగల్లో మేడారం జాతర ఒకటి. రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరకు రాష్ర్ట నలుమూలల నుంచి భక్తులు కొన్ని లక్షల సంఖ్యలో వస్తుంటారు. ఈ మహా జాతర వైభవం, విశిష్టతలను గురించి చెప్తూ రాష్ర్ట ప్రభుత్వం తాజాగా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఒక వీడియోను విడుదల చేసింది. ఇంగ్లీష్, హిందీ భాషల్లో విడుదలైన వీడియోకు ప్రముఖ బాలీవుడ్ నటుడు బిగ్ బి అమితాబ్ బచ్చన్ గాత్రదానం చేశారు. ఆసియా ఖండంలో జరిగే అతిపెద్ద జాతర మేడారం జాతర అని వివరిస్తూ...జాతర విశేషాలను క్లుప్తంగా చెప్పుకొచ్చారు. ఎప్పటి నుంచో ఈ జాతరకు జాతీయ హోదా ఇవ్వాలని రాష్ర్ట ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్న క్రమంలో జాతర విశేషాలు, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జాతర విశేషాలను తెలియజేయాలన్న సంకల్పంతోనే ఈ వీడియో ద్వారా ప్రచారం చేస్తున్నట్లు మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు.

జాతరకు నెలరోజుల ముందు నుంచే వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తుంటారు. ఈ జాతరలో అమ్మవార్లకు నైవేద్యంగా బెల్లంను సమర్పించుకుంటారు. ఇక్కడికి వచ్చే భక్తుల కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేస్తుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని వసతులను సమకూరుస్తుంది. ఈ మహా జాతర ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మేడారంలో ఫిబ్రవరి 5 నుంచి 8 తేదీల వరకూ..జరగుతుంది.

Next Story